Periods: మహిళల జీవితంలో నెలసరి చాలా ముఖ్యమైనది. ప్రతినెలా ఋతుస్రావం కావాల్సిందే. ఒక్క నెల జరగకపోయినా ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చిందని అర్థం చేసుకోవాలి. అయితే వేలాది మంది భారతీయ మహిళలను ప్రభావితం చేస్తున్న సమస్య ‘రక్తస్రావం అధికంగా జరగడం’. ఇలా ప్రతి నెలా జరగడం వల్ల బలహీనతతో పాటు రక్తహీనత సమస్యలు వస్తాయి. శరీరం పట్టు తప్పుతుంది. ఇలా సాధారణం కన్నా అధికంగా రక్తస్రావం అయ్యే సమస్యను మెనోరాగియా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలోనే భారీ రక్తస్రావంతో పాటు ఏడు రోజులు కన్నా ఎక్కువ కాలం పాటు నెలసరి ఉంటుంది. మెనోరాగీయ వ్యక్తిగత జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఇది రావడానికి కొన్ని కారణాలు ఉండే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్మోన్ల అసమతుల్యత
ఎక్కువ మంది మహిళలు ఇబ్బంది పడుతున్న సమస్య ‘హార్మోన్ల అసమతుల్యత’. హార్మోన్ల ఉత్పత్తి స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉండడం... ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్లు అసమతుల్యంగా ఉండడం వల్ల సాధారణ రుతుక్రమానికి ఇవి అంతరాయం కలిగిస్తాయి. దీనివల్ల అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
గర్భాశయ ఫైబ్రాయిడ్లు
గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఏర్పడడం వల్ల కూడా భారీ రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. గర్భాశయంలో గడ్డల్లాంటివి ఏర్పడతాయి. దీనికి కచ్చితంగా చికిత్స అవసరం.
పాలిప్స్
ఇవి గర్భాశయంలోపలే ఏర్పడతాయి. ముఖ్యంగా గర్భశయ లైనింగ్ పై చిన్నచిన్న గడ్డల్లా పెరుగుతాయి. వీటి వల్ల కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
అడెనోమియాసిస్
గర్భాశయ లైనింగ్‌ను ఎండోమెట్రియం అంటారు. ఈ గర్భాశయం కండరాల గోడల్లోకి అసాధారణంగా పెరుగుతున్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. రక్తస్రావం అధికంగా జరుగుతుంది. దీనికి కూడా కచ్చితంగా చికిత్స అవసరం.
రక్తం గడ్డ కట్టే వ్యాధులు
కొందరిలో రక్తం గడ్డ కట్టడాన్ని ప్రభావితం చూసే కొన్ని వైద్య పరిస్థితులు ఉంటాయి. అలాంటి రోగాల బారిన పడిన వారికి కూడా నెలసరి సమయంలో భారీ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్
దీనిని PID అని కూడా పిలుస్తారు. దీనివల్ల పునరుత్పత్తి అవయవాల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనితో అధిక రక్తస్రావం జరుగుతూ ఉంటుంది.
అధికంగా రక్తస్రావం జరగడం వల్ల ఇనుము వంటి ముఖ్యమైన పోషకాలు బయటికి పోతాయి. దీనివల్ల శరీరం అలసట, బలహీనత బారిన పడుతుంది. రక్తాన్ని భారీగా కోల్పోవడం వల్ల శ్వాస ఆడక పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే మైకం కమ్మడం, తలనొప్పి రావడం వంటి లక్షణాలు కూడా వస్తాయి.
ప్రతి నెలా అధిక రక్తస్రావం జరగడానికి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్సను అందిస్తారు.
Also read: ఈ కుక్క పిల్లల మధ్య ఒక బంతి దాగుంది, దాన్ని పది సెకన్లలో కనిపెడితే మీ కంటి చూపు సూపర్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.