Reproduction : మహిళల్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం హార్మోన్ల ప్రభావమే. అయితే వీటి ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని తేల్చింది కొత్తగా నిర్వహించిన ఓ అధ్యయనం. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్న మహిళలు.. హార్మోన్ల పరిస్థితి సాధారణంగా ఉండే మహిళల కంటే ఆత్మహత్యకు ప్రయత్నించే అవకాశం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉందని కొత్త అధ్యయనం తేల్చి చెప్పింది.
లక్షణాలు ఇవే..
PCOS స్త్రీ సంతానోత్పత్తి, రూపాన్ని ప్రభావితం చేస్తుంది. PCOS సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో ఇది 8 శాతం నుంచి 13 శాతం మందిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గర్భం దాల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యే వరకు చాలామందికి ఈ రుగ్మత ఉందని కూడా తెలియదు. పిల్లలు పుట్టట్లేదని ఇబ్బంది పడేవారిలో చాలామందికి ఈ సమస్య ఉంటుంది. మొటిమలు రావడం, ముఖంపై జుట్టు పెరుగుదల అధికంగా ఉండడం, ఊబకాయం, పీరియడ్స్ సమయానికి రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వారి జీవన నాణ్యతను బాగా దెబ్బతీస్తాయి.
తాజాగా అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ఓ అధ్యయనం గురించి ప్రచురించారు. ఈ న్యూ స్టడీ ప్రకారం.. PCOS బాధితుల్లో ఆత్మహత్య ప్రయత్నాల ప్రమాదం 8.47 రెట్లు ఎక్కువ. ముఖ్యంగా నయం చేయలేని, చికిత్స చేసేందుకు వీలుగా లేని పరిస్థితి ఉన్న యువతులలో 5.38 రెట్లు అధిక ప్రమాదం ఉందని తేల్చారు. ఇది PCOS సమస్యతో బాధపడుతున్న మహిళల్లో మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య ప్రమాదాన్ని పెంచుతుందని ఈ అధ్యయనంలో వెల్లడించారు.
19వేల మందిపై స్టడీ
ఈ అధ్యయనం కోసం తైవాన్‌లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు 1997 నుంచి 2012 మధ్య కాలంలో PCOSతో బాధపడుతున్న 12 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల దాదాపు 19,000 మంది మహిళలపై ఈ స్టడీ చేశారు. వయస్సు, ఆదాయం, శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. దీనిప్రకారం 40 ఏళ్లలోపు PCOS బాధిత మహిళల్లో ఆత్మహత్య ప్రయత్నాల ప్రమాదం 9.15 రెట్లు ఎక్కువ, వృద్ధుల్లో 3.75 రెట్లు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. వృద్ధులపై PCOS లక్షణాల ప్రభావం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.
గత అధ్యయనాల ఏమంటున్నాయంటే..
PCOSతో బాధపడుతున్న మహిళలకు డిప్రెషన్, యాంగ్జైటీ, పర్సనాలిటీ డిజార్డర్స్, స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని మునుపటి అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. సంతానోత్పత్తికి సంబంధించిన విషయం PCOS ఉన్నవారి మానసిక స్థితిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇవే కాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్, హార్మోన్ల ప్రభావాలను నిరోధించే మందులు కూడా కాస్త ఇబ్బంది కలిగిస్తాయి.
ప్రెగ్నెంట్ కావాలంటే మాత్రం..
అండాశయాలు అదనపు హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు సంభవించే PCOSకి ఎటువంటి నివారణ లేదని నిపుణులు చెప్తున్నారు. అధిక ఇన్సులిన్ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాయామాలు చేసి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. కాని ఇది ఏ మాత్రం వారిపై మంచి ప్రభావం చూపించదు. మీరు ప్రెగ్నెంట్ కావాలనుకుంటే మాత్రం మీరు అండోత్సర్గము చేయించుకోవాల్సి వస్తుంది.
Also Read : ఈ టిప్స్ ఫాలో అయితే కేవలం 5 నిమిషాల్లోనే మీ ఒత్తిడి తగ్గించుకోవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.