యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 23న సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC CSE 2022) తుది ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో యూపీకి చెందిన ఇషితా కిశోర్ అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో బిహార్‌కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానం కైవసం చేసుకుంది. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో నిలవగా.. అసోంకి చెందిన మయూర్ హజారికా ఐదో స్థానం, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరోస్థానం దక్కించుకున్నారు. 


మొదటి 4 ర్యాంకులు అమ్మాయిలవే.. 
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి సత్తాచాటారు. మొదటి నాలుగు ర్యాంకులను అమ్మాయిలే సాధించడం విశేషం. వీరిలో ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో మెరవగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో నిలిచి సత్తాచాటారు.


సివిల్స్ టాపర్‌గా ఇషితా కిశోర్.. 
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇషిత కిషోర్.. సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో టాపర్‌గా నిలిచింది. ఇషిత తన మూడో ప్రయత్నంలోనే విజయం సాధించారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమినరీ పరీక్ష కూడా అర్హత సాధించలేకపోంది. అయితే మూడో ప్రయత్నంలో మాత్రం ఏకంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లి, సివిల్స్ టాపర్‌గా నిలవడం విశేషం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొలి ర్యాంకు సాధించడం పట్ల ఇషిత కిషోర్ తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తం చేశారు. అయితే సివిల్స్‌లో క్వాలిఫై అవుతాననే ధీమా ముందు నుంచే ఉందన్న ఇషితా.. కానీ తొలి ర్యాంకు వస్తుందని అసలు ఊహించలేదని తెలిపారు.


ఇషిత కిషోర్ ప్రస్థానం ఇలా..
ఇషిత కిషోర్ ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలలో ఎకనామిక్స్‌లో 2017లో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అడ్వైజర్‌గా ఎకనామిక్స్ విభాగంలో పనిచేశారు.  తాను టాపర్‌గా నిలిచేందుకు చేసిన ప్రయాణంలో వెంట ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తన తల్లిదండ్రులు పూర్తి సహకరం అందించారని చెప్పారు. స్నేహితులు తనను గైడ్ చేశారని పేర్కొన్నారు. యూపీఎస్సీ పరీక్షలో తాను క్వాలిఫై అవుతానని పూర్తి నమ్మకం ఉండేదని.. అయితే తొలి ర్యాంకు సాధించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసిందని ట్వీట్ చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌లో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.


విజయానికి మూడు సూత్రాలు..
సివిల్ సర్వీసెస్ టాపర్‌గా నిలిచిన నిశిత ముఖ్యంగా మూడు సూత్రాలను నమ్మేది. వాటిలో మొదటిది - గ్రూప్‌గా ఉన్నపుడు అందులో చురుకైన పాత్ర పోషించాలి. రెండోది- ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే అందరి సహకారం, భాగస్వామ్యం అవసరం. ఇక మూడోది వివిధ రంగాలపై విస్తృత స్థాయి పరిజ్ఞానం ఉండాలని నిశిత అంటారు. ఒక సివిల్ సర్వీస్ అధికారిగా అన్ని రంగాలపైనా అవగాహన అవసరం అని ఆమె చెబుతారు.


చదువులోనే కాదు ఆటల్లోనూ...
సివిల్ సర్వీసెస్‌లో టాపర్‌గా నిలిచిన ఇషిత కిషోర్ చదువులోనే కాదు.. ఆటల్లోనూ మేటిగా ఉండేది. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో చురుగ్గా పాల్గొనేదీ. 2017లో దుబాయ్‌లో జరిగిన మిలీనియం వరల్డ్ సమ్మిట్‌లో ఇండో-చైనా యూత్ డెలిగేట్‌గా ఇషిత పాల్గొన్నారు. 


Relate Articles:


➥ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల, తిరుపతికి చెందిన పవన్ కు 22వ ర్యాంక్


సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు యువతీయువకులు వీరే, తెలంగాణ యువతికి మూడో ర్యాంకు