Virat Kohli, IPL 2023:


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో తన జట్టును ప్లేఆఫ్‌ చేర్చలేకపోయినందుకు బాధపడుతున్నాడు. లక్ష్యానికి కాస్త దూరంలో ఆగిపోయామని, మళ్లీ ఘనంగా తిరిగొస్తామని పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం పెట్టాడు.




ఐపీఎల్‌ 2023లో రాయల్‌ ఛాలెంజర్స్‌ (Royal Challengers Banalore) ప్రస్థానం లీగ్‌ దశతోనే ముగిసింది. మరోసారీ అభిమానులను నిరాశపరిచింది. ఆఖరి మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ చేతిలో ఓడిపోవడంతో ప్లేఆఫ్‌కు దూరమైంది. వరుసగా పదహారో సీజన్లోనూ నిరాశగా వెనుదిరిగింది. దాంతో అభిమానులను ఊరడించేందుకు కోహ్లీ (Virat Kohli) సహా ఇతర ఆర్సీబీ క్రికెటర్లు సోషల్‌ మీడియాలో సందేశాలు పోస్టు చేస్తున్నారు.


'ఈ సీజన్లో మాకు మంచి మూమెంటమ్‌ లభించింది. కానీ దురదృష్టవశాత్తు లక్ష్యానికి కాస్త దూరంలో ఆగిపోయాం. నిరాశపరిచాం. ఏదేమైనా మనం తలెత్తుకొని నిలబడాల్సిన తరుణం ఇది. మా ప్రయాణంలో ప్రతి దశలోనూ అభిమానులు, సపోర్టర్స్‌ మాకు అండగా నిలబడ్డారు. మా కోచింగ్‌ బృందం, మేనేజ్‌మెంట్‌, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు. మేం మళ్లీ ఘనంగా తిరిగొస్తాం' అని విరాట్‌ కోహ్లీ పోస్టు చేశాడు.




ఆర్సీబీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ సైతం ఇలాంటి మెసేజే ఇచ్చాడు. 'మేం అంచనాల మేరకు రాణించలేదు. ఫలితాలు మాకు అనకూలంగా రాలేదు. ట్రోఫీ కోసం మా పరుగు ఇంకా కొనసాగుతూనే ఉంది. గెలిచినా, ఓడినా మాకు అండగా నిలబడ్డ అభిమానులకు ధన్యవాదాలు. మాకెప్పుడూ మీరే ప్రాణం' అని డీకే అన్నాడు.


ఈ సీజన్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మోస్తరు ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలబడింది. 14 మ్యాచుల్లో 7 గెలిచి 7 ఓడింది. 0.135 రన్‌రేట్‌, 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు దూరమైంది. అయితే విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌ మాత్రం అదరగొట్టారు. ఇప్పటి వరకైతే పరుగుల పరంగా టాప్‌-3లో నిలిచారు.




ముఖ్యంగా కింగ్‌ కోహ్లీ 14 మ్యాచుల్లో 139.82 స్ట్రైక్‌రేట్‌తో 639 పరుగులు చేశాడు. ఏకంగా రెండు సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు కొట్టేశాడు. 65 బౌండరీలు, 16 సిక్సర్లు బాదాడు. ఇక డుప్లెసిస్‌ 153.68 స్ట్రైక్‌రేట్‌, 56.15 సగటుతో 730 పరుగులు చేశాడు. 8 హాఫ్‌ సెంచరీలు, 60 బౌండరీలు, 36 సిక్సర్లు బాదాడు.