➥ యూపీఎస్సీ లాంటి సంస్థకు గ్రూప్-1 పరీక్షల బాధ్యత అప్పగించాలి
➥ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై మరోసారి సందిగ్ధం నెలకొంది. మరోసారి అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడమే ఇలాంటి పరిస్థితి నెలకొంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి ‘సిట్’తోపాటు ఈడీ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం ఉందని, యూపీఎస్సీ లాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని పిటిషనర్లు కోరారు.
గతేడాది అక్టోబరులో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతోపాటు జూన్ 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ జారీచేసిన వెబ్‌నోట్‌ను రద్దు చేయాలని కోరుతూ.. అశోక్‌కుమార్ మరో నలుగురు, టి.రమేశ్, జె.సుధాకర్‌లు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం (జూన్ 1న) జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గతేడాది పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్ అయిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్ చేసిందని, ఈ సంఖ్య 100కు చేరవచ్చన్నారు. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దుచేసి తాజాగా నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిందన్నారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగించాలని కోరారు. ఓవైపు దర్యాప్తు జరుగుతోందని, నిందితులందరూ ఇంకా బయటపడలేదని, అయినా పరీక్ష నిర్వహించడానికి కమిషన్ సిద్ధపడుతోందన్నారు. కేవలం ఎన్‌ఆర్‌ఐల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. పరీక్షలకు సంబంధించి 5 లక్షల మంది ఆశావహులున్నారన్నారు. పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ లీకేజీ వ్యవహారంలో 49 మంది ఉద్యోగులు లేరని, కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. దీనికి బాధ్యులైనవారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ, రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ కంట్రోలర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు.
Also Read:
'గ్రూప్-1' ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి, ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు!
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకారం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్
ఏపీలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉందని, దాని తర్వాతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది తెలుస్తుందని, ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 2019 నుండి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ 57 నోటిఫికేషన్ల విడుదల చేసిందని, వీటి ద్వారా 5,447 పోస్టులను భర్తీ చేసిందని సవాంగ్ తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జూన్ 3 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ద్వారా మెయిన్స్ పరీక్షలు రాసేందుకు 6,455 మంది అర్హత సాధించారని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
గ్రూప్-1 హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..