ఏపీలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉందని, దాని తర్వాతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది తెలుస్తుందని, ఆ తర్వాత నోటిఫికేషన్‌ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 2019 నుండి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ 57 నోటిఫికేషన్ల విడుదల చేసిందని, వీటి ద్వారా 5,447 పోస్టులను భర్తీ చేసిందని సవాంగ్ తెలిపారు.


రానున్న కాలంలో మరో 19 నోటిఫికేషన్ల ద్వారా 1962 పోస్టులను భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు. కోర్టు కేసుల వల్ల నియామక ప్రక్రియ చాలా ఆలస్యమైతోందని, దీన్ని పరిష్కరిం చేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కొంతమంది పోస్టుల భర్తీ, ఇతర అంశాలపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీరిపై నిఘా పెట్టామని, వారిని కనిపెట్టి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు.


గ్రూప్-1 మెయిన్స్ ఏర్పాట్లు పూర్తి..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ద్వారా మెయిన్స్ పరీక్షలు రాసేందుకు 6,455 మంది అర్హత సాధించారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ప్రశ్నపత్రం అందిస్తామని, సాంకేతిక సమస్యలు ఉన్నందున గతంలోలా ట్యాబ్‌లలో ప్రశ్నపత్రాలు ఇవ్వట్లేదని తెలిపారు. పరీక్షలు జరిగే తీరును ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి చూసేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సవాంగ్ వెల్డలించారు. కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు దూరంగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సవాంగ్ తెలిపారు. 


నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ..
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 10 నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు తీస్తారు. ఉదయం 9.30 గంటల్లోగా అభ్యర్థులు తమ తమ గదులకు వెళ్లాలి. ఆ తర్వాత 15 నిమిషాల వరకు వెసులుబాటు ఉంటుందన్నారు. 9.45 నిమిషాలు దాటితే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించరని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. జులై నెలాఖరునాటికి ఫలితాలు ప్రకటించి, ఆగస్టులోగా మౌఖిక పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు, పరీక్ష షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


Also Read:


'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి, ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు!
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకారం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో నియామక నిబంధనల ప్రకారం పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగా పరీక్ష కేంద్రాలను పేర్కొంటూ హాల్‌టికెట్లు జారీ చేసేందుకు కమిషన్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇది మరో రెండు రోజుల్లో ముగియనుంది. గ్రూప్-1 హాల్‌టికెట్లు జూన్ 3 లేదా 4న అందుబాటులోకి రానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు.
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...