Job for Gamers: మీరు గేమ్‌లు ఆడేందుకు ఇష్టపడతారా? గేమింగ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకునే హార్డ్‌కోర్ గేమర్లా? ఈ ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానం అవును అయితే, ఈ శుభవార్త మీకే. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQoo మీలాంటి వ్యక్తుల కోసం వెతుకుతోంది. ఐకూ మొబైల్ ఫోన్‌లలో అత్యుత్తమ గేమింగ్, eSports అనుభవాన్ని సృష్టించడంలో కంపెనీకి సహాయపడటానికి చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కోసం వెతుకుతోంది. తమ అభిరుచిని కెరీర్‌గా మార్చుకోవాలనుకునే తెలివైన గేమర్‌లకు కంపెనీ ఉద్యోగాలను అందిస్తోంది.


కంపెనీ గేమింగ్ ఆఫీసర్ కోసం ఎందుకు వెతుకుతోంది?
గేమింగ్ ఆఫీసర్‌ను చేర్చుకోవడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉంది. భారతదేశంలో గేమింగ్ ఆడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీనికి తోడు బీజీఎంఐ గేమ్‌పై బ్యాన్‌ను ఎత్తేశారు. ఈ గేమింగ్ ఆఫీసర్లు గేమర్‌ల కోసం సరైన స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించడంలో సహాయపడతారు.


గేమర్స్ ఆటలు ఎలా ఆడతారు? వారి గేమింగ్ శైలి ఎలా ఉంటుంది? గేమ్‌ను ఎలా అర్థం చేసుకుంటారు? అనే విషయాలను ఈ గేమింగ్ ఆఫీసర్ కంపెనీకి వివరించాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత కంపెనీ ఒక ఖచ్చితమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తుంది.


రూ. 10 లక్షల నగదు బహుమతి
చీఫ్ గేమింగ్ ఆఫీసర్‌కు భారతదేశం అంతటా ఉన్న ప్రతిభావంతులైన గేమర్‌లతో కలిసి పని చేసే సువర్ణావకాశం ఉంటుంది. వారిని మరింత ఉత్తేజపరిచేందుకు ఐకూ మొదటి CGOకి రూ. 10,00,000 నగదు బహుమతిని అందజేస్తోంది. యువకులు, ముఖ్యంగా జనరేషన్ Z, గేమింగ్ పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారని ఐకూ సీఈవో నిపున్ మరియా అభిప్రాయపడ్డారు.


iQOO భారతీయ గేమర్‌లకు వినూత్నమైన, ఉత్తేజకరమైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తోంది. గేమింగ్ పరిశ్రమలో యువ ప్రతిభను ప్రోత్సహించడానికి కంపెనీ దీన్ని పరిగణిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ అవకాశం 25 సంవత్సరాల లోపు యువకులకు మాత్రమే అందుబాటులో ఉంది.


ఎలా దరఖాస్తు చేయాలి?
ఐకూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ గేమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా "iQOO India" ఇన్‌స్టాగ్రాం పేజీ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2023 మే 30వ తేదీ నుంచి ప్రారంభం అయింది. మీరు 2023 జూన్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఐకూ నియో 8 స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఐకూ నియో 8 స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఐకూ నియో 8 ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ34, ఏ54 మొబైల్స్‌తో పోటీ పడనుంది.


ఈ ఫోన్‌లో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,499 యువాన్లుగా (సుమారు రూ.29,300) నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లు (సుమారు రూ.32,800) కాగా, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,099 యువాన్లుగా (సుమారు రూ.36,400) ఉంది. నైట్ రాక్, మ్యాచ్ పాయింట్, సర్ఫ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


Read Also: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!