తెలంగాణ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (TS TET - 2023) దరఖాస్తు గడువు ఆగస్టు 16తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 15న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో 'టెట్' పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.


ఇదిలా ఉండగా.. టెట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి.  పరీక్షా కేంద్రాల ఎంపిక అవకాశాన్ని కొన్ని జిల్లాల్లో నిలిపివేశారు. దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు ఉండగానే పలు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారు. మొత్తం 6 జిల్లాలను (మంగళవారం సాయంత్రం వరకు) బ్లాక్‌ చేశారు. సోమవారం నాడు హైదరాబాద్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలను బ్లాక్‌ చేయగా, మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బ్లాక్‌ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.


బ్లాక్‌ చేసిన జిల్లాలను పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తొలగించారు. గడువు ఉండగానే ఆ ఆరు జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్‌ చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు టెట్‌ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు అంచనా వేయలేకపోయారు. దరఖాస్తులకు అనుగుణంగా జిల్లాల్లో తక్కువ పరీక్షా కేంద్రాల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. మరోవైపు బుధవారం (ఆగస్టు 16) సాయంత్రంతో టెట్‌కు గడువు ముగియనుంది.


ఇప్పటివరకు 2.5 లక్షల దరఖాస్తులు..
మంగళవారం (ఆగస్టు 15) సాయంత్రం నాటికి మొత్తం 2,50,963 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్‌-1కు 74,026 మంది, పేపర్‌-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాసేందుకు 1,60,931 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాది 3,79,101 దరఖాస్తులు వచ్చాయి. అప్పుడు కూడా ఇదే విధంగా పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి దరఖాస్తులు సంఖ్య చాలా తక్కువగానే ఉంది. బుధవారం (ఆగస్టు 16) సాయంత్రం వరకు గడువు ఉండడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎంతలేదన్నా కూడా 3 లక్షల లోపే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


గతేడాదంటే అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారనుకోవచ్చు. ఈసారి తక్కువగానే దరఖాస్తులు వచ్చినా ఎందుకు బ్లాక్‌ చేశారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే అనుకున్నదానికంటే సెంటర్ల పరిమితి మించడంతోనే జిల్లాలను బ్లాక్‌ చేశామని అధికారుల వాదన. పరీక్షా కేంద్రాలు కేటాయించలేనంతగా సామర్థ్యానికి మించి టెట్‌ దరఖాస్తులు వచ్చినట్లుగా వారు చెబుతున్నారు.


ఎడిట్‌ ఆప్షన్‌ గడువూ పెంచాల్సిందే..
మరోవైపు ఎడిట్‌ ఆప్షన్‌ (దరఖాస్తుల సవరణ) ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఒక్కొక్కరు రెండేసి సార్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. టెట్‌ దరఖాస్తులకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చి గడువును మరో రెండు మూడు రోజులు పెంచాలని కోరుతున్నారు. 50 వేలు నుంచి లక్ష వరకు అభ్యర్థులు టెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదని డీఎడ్‌ బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు.


చాలా మంది అభ్యర్థులు టెట్‌ దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని తప్పులు దొర్లాయి. దీంతో వారికి సరిచేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేయడంతో వేలాది మంది అభ్యర్థులు తమ సొంత జిల్లాలను వదిలి పరీక్ష రాసేందుకు చాలా దూరపు జిల్లాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతారన్నారు. బ్లాక్‌ చేసిన జిల్లాలను తిరిగి కేటాయించాలని డిమాండ్‌ ఆయన చేశారు. టెట్‌ అప్లికేషన్‌ పూర్తి చేశాక దరఖాస్తు డౌన్‌లోడ్‌ కావడంలేదు.


బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, అంచనా మేరకు రాష్టంలో 1.5 లక్షల డీఎడ్‌, 4.5 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్‌ వారికే ఇవ్వగా.. కొత్తగా బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2లక్షల మంది టెట్‌ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకు ఉండనున్నారు. తాజా టెట్‌ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కనుంది.


తెలంగాణ టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


ముఖ్యమైన తేదీలు..


➥ టెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి: 01.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.08.2023.


➥ హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో:  01.08.2023 - 15.08.2023.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 09.09.2023.


➥ టెట్ పరీక్ష తేదీ: 15.09.2023.


పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.


పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.


Notification - TSTET 2023


Online Application


Information Bulletin