TGPSC Group1 Exam: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు కేవలం 3.02 లక్షల మంది మాత్రమే (74 శాతం) హాజరైనట్లు తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) వెల్లడించింది. అయితే క్షేత్రస్థాయి నుంచి వివరాలు అందిన తర్వాతే హాజరుశాతంపై స్పష్టత వస్తుందని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్-1లో మొత్తం 536 పోస్టులుండగా, ఒక్కో పోస్టుకు 536 మంది చొప్పున పోటీపడుతున్నారు. మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది అభ్యర్థులను మెయిన్‌కు ఎంపికచేయనున్నారు.   


గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని అతి త్వరలో విడుదల చేయనున్నట్లు నవీన్ నికోలస్ తెలిపారు. ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూడాలని సూచించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించే అభ్యర్థులకు అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌–1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు. టీజీపీఎస్సీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌(సీసీకెమెరా) ద్వారా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించినట్లు నవీన్‌ నికోలస్‌ తెలిపారు. పరీక్ష పక్కాగా నిర్వహించామని, నిర్వహణలో కీలకపాత్ర పోషించిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి కమిషన్‌ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


ప్రశ్నల తీరుపై మిశ్రమ స్పందన...


➥ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన ప్రశ్నల తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రశ్నలు సులభతరంగా ఉన్నాయని కొందరు అభ్యర్థులు చెబుతుండగా.. ప్రశ్నపత్రం కఠినంగా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గత ఐదేళ్ల కాలానికి సంబంధించిన సాధారణ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని, సుదీర్ఘ ప్రణాళికతో సన్నద్ధమయ్యేవారు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధిస్తారని నిపుణులు అంటున్నారు. 


➥ తెలంగాణ ఆనవాళ్లు.. ఉద్యమ ప్రస్తావన లేకుండానే గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌‌లో ప్రశ్నలు ఇచ్చారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మలిదశ, తొలిదశ ఉద్యమాలు; భాష, సినిమాలు, మాండలికాలను పూర్తిగా విస్మరించారన్నారు. తెలంగాణ అస్తిత్వం లేకుండానే ప్రశ్నపత్రాన్ని రూపొందించారని మండిపడుతున్నారు.


➥ తెలంగాణతో ముడిపడి ఉన్న అనేక అంశాలపై గతంలో ప్రశ్నలు ఇచ్చేచ్చారు. కానీ జూన్ 9న నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో ఒక్క ప్రశ్న కూడా కనిపించలేదు. దీంతో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


➥ రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన మహాలక్ష్మి, గృహజ్యోతిపై రెండు ప్రశ్నలిచ్చారు. మహాలక్ష్మిలో భాగమైన ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లను సబ్సిడీ ధరకు సరఫరా చేయడంపై ఒక ప్రశ్న, గృహజ్యోతిపై మరో ప్రశ్న ఇచ్చారు.


➥ పరీక్షలో భాగంగా తెలంగాణ ఆధునిక చరిత్ర, కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ సైన్స్‌, పర్యావరణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా, 


➥ పరీక్షలో రీజనింగ్‌ ప్రశ్నలను కాస్త కఠినంగా ఇచ్చారు. అయితే గత రెండు గ్రూప్‌ -1 ప్రిలిమ్స్ పరీక్షలతో పోల్చితే తాజాగా నిర్వహించిన పరీక్ష కాస్త సులభంగానే ఉన్నట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


కటాఫ్‌ మార్కులు పెరిగే అవకాశం..?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి గ్రూప్-1 పోస్టుల భర్తీని చేపడుతున్నారు. రెండేళ్ల క్రితమే గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల చేసి, రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే వివిధ కారణాల వల్ల రెండుసార్లు పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. అయితే గత ప్రశ్నపత్రాలతో పోలిస్తే తాజాగా వచ్చిన క్వశ్చన్ పేపరు‌లో ప్రశ్నలు సులభంగా, కొన్ని అత్యంత సులభంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే కటాఫ్‌ మార్కులు పెరిగే అవకాశం ఉంది.  


మద్యంమత్తులో గ్రూప్‌–1 విధులకు హాజరు..
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించే అన్వర్‌ మీర్జా పర్వేజ్‌బేగ్‌కు తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాలలో 'గ్రూప్‌–1' పరీక్ష విధులు కేటాయించారు. అయితే ఆయన మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అన్వర్‌ మీర్జాను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా.. రీడింగ్‌ 173 వచ్చింది. దీంతో అతడిని విధుల నుంచి తప్పించారు.


జగిత్యాలలో ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం..
జగిత్యాల జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.  ఓ ప్రైవేటు కాలేజీలో ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం కారణంగా అభ్యర్థులు మార్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహంతో అభ్యర్ధులకు తప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పరీక్ష ముగియడానికి ఇంకా అరగంట ఉందనంగా.. ఇంకా 5 నిమిషాలే ఉందని అభ్యర్ధులను తొందర పెట్టాడు. దీంతో సదరు ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం కారణంగా సమయం మించి పోతుందని అభ్యర్థులు తొందరలో ఓఎమ్‌ఆర్‌ షీట్‌లో ఏదో ఒక ఆన్సర్‌ను బబుల్ చేశారు. తీరా చేస్తే ఇంకా సమయం ఉందని తెలియడంతో ఆ గదిలోని గ్రూప్‌1 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇన్విజిలేటర్ తొందర పెట్టినందున కొన్ని ప్రశ్నలకు ఏదో ఒక ఆన్సర్‌ పెట్టి పరీక్ష త్వరగా ముగించామని, దీంతో తమకు మార్కులు తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...