తెలంగాణలో టెట్ పరీక్ష (TS TET 2022)ను వాయిదా వేయాలని డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Telanagana Education Minister Sabita Indrareddy) ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. నేడు పలువురు ఎన్‌ఎస్‌యూఐ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు మంత్రి సబిత ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సబిత ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా, ఎన్‌ఎస్‌యూఐ నేతలు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


వివాదం ఏంటంటే.. 
తెలంగాణలో టెట్ పరీక్షను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నారు. ఏ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. టెట్ పరీక్ష రాయాల్సిన రోజే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పరీక్ష ఉన్నందున, TET వాయిదా వేయాలని డిమాండ్లు వచ్చాయి. అయినా పరీక్ష వాయిదా వేసే ఆలోచన లేదని, అభ్యర్థులు పూర్తిగా సిద్ధం కావాలని మంత్రి సబిత ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఒకేరోజు ఆర్‌ఆర్‌బీ, టెట్ ఎగ్జామ్ ఉన్నాయని.. అందులో ఏదో ఒక పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతామని, కనుక రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి టెట్ నిర్వహణను వాయిదా వేయాలని అభ్యర్థులు మంత్రిని కోరినా ప్రయోజనం లేకపోవడంతో కొందరు అభ్యర్థులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను సహాయం కోరారు.






కేటీఆర్ ట్వీట్ చేసినా నో ఛేంజ్.. 
ఒకేరోజు టెట్, ఆర్‌ఆర్‌బీ ఎగ్జామ్స్ ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం టెట్‌ను వాయిదా వేయాలని ఓ అభ్యర్థి ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనిపై పునరాలోచించాలని మంత్రి సబితకు కేటీఆర్ సూచించారు. కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. టెట్ పరీక్షకు సుమారు 3.5 లక్షల మంది హాజరు కానున్నారని, టెట్ పరీక్ష షెడ్యూల్ చేయడానికి ముందే ఇతర పరీక్షల తేదీలను చెక్ చేసి షెడ్యూల్ ఖరారు చేశామని సబితా తెలిపారు. టెట్ వాయిదాపై అధికారులతో తాను మాట్లాడానని, పరీక్ష వాయిదా వేయడం కుదరదని ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. 


జూన్ 6 నుంచి హాల్‌టికెట్లు 
టెట్ 2022 అభ్యర్థులు జూన్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఇదివరకే తెలిపారు. 5 ఏళ్ల తర్వాత టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించనుండటంతో టెట్ పరీక్షకు మొత్తం 6,29,352 మేర అప్లికేషన్లు వచ్చాయి. పేపర్ 1కు 3,51,468, పేపర్ 2కు 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చారు.