తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలోని పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో త్వరలో 20 వేల పోలీసు నియమకాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వివిధ విభాగాల్లో 80 వేలకు పైగా పోలీసు నియామకాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మహిళా ప్రాధాన్య‌త‌లో భాగంగా నియామ‌కాల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన‌ట్లు గుర్తు చేశారు. 




తెలంగాణలో త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, ఎన్నికలు సహా పలు కారణాల వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలతో కొత్త జోన్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. దీంతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.  రాష్ట్ర పోలీసు శాఖలో ఇప్పటికే 19,449 పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికి సర్కారు సైతం ఆమోదముద్ర వేసింది. అన్నీ అనుకూలంగా జరిగితే జూలై నెలాఖరుకు పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. 
త్వరలో మరిన్ని పోస్టుల భర్తీ.. 
పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ అనంతరం మరిన్ని శాఖలలో ఉద్యోగాలను సైతం భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్య, వైద్య శాఖలలో కూడా అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటికి సంబంధించిన నోటిపికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయనుంది. వీటి తర్వాత గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 



టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ నియామకం..
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ )కి చైర్మన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ గా డా. బి. జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. జనార్దన్ రెడ్డి ప్రస్తుతం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.