Free Training for Competitive Examinations in 6 Universities in Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. యూనివర్సిటీలలో ఉచిత కోచింగ్ ఇచ్చి, విద్యార్థులను ఉద్యోగాలు సాధించే అభ్యర్థులుగా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్సిటీ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు తెలంగాణలోని 6 విశ్వవిద్యాలయాల్లో ఏప్రిల్ 20 తేదీ నుంచి ఉచిత శిక్షణ (Free Coaching in 6 Universities) ఇవ్వనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులు
ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిధులను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత శిక్షణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)jr రూ.5 లక్షలు, కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) కి రూ.4 లక్షలు, రాష్ట్రంలోని మిగతా 4 యూనివర్సిటీలకు సైతం శిక్షణ నిమిత్తం నిధులు మంజూరు చేసింది. వర్సిటీలలో ఫ్రీ కోచింగ్ తో పాటు అభ్యర్థులకు ఉచిత మెటీరియల్ అందజేయనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. అయితే ఎక్కువ మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో భాగంగా ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు లేకుండా చూస్తామని చెప్పారు.
గ్రూప్స్‌తో పాటు పోలీస్ జాబ్స్‌కు..
గ్రూప్-1, 2, 3, 4, పోలీస్, ఎక్సైజ్, టీచర్ పోస్టులతోపాటు మెడికల్, ఇతర పోస్టులకు ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన (కరీంనగర్), మహాత్మాగాంధీ (నల్లగొండ) యూనివర్సిటీల్లో ఉచితంగా కోచింగ్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వర్సిటీ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీయే కాకుండా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని రప్పించి ఉద్యోగార్థులకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.
Also Read: Telangana Jobs: నిరుద్యోగలకు గుడ్ న్యూస్, 3334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
80 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ప్రకటన
ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటిలో ముందుగా గ్రూప్ 1, హోం శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 503 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ, గ్రూప్ 2 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. మొదట గ్రూప్ 1 సహా పలు శాఖల్లోని 30 వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆ తరువాత ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3334 ఉద్యోగాలను భర్తీకి ఆర్థిక శాఖ అంగీకరించింది. ఈ నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల చేస్తారని నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.