తెలంగాణలో జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర హైకోర్టు అక్టోబరు 28న కీలక ఆదేశాలు జారీచేసింది. నోటిఫికేషన్ ప్రకారం భర్తీ కాగా మిగిలిన జూనియర్ లైన్‌మెన్ పోస్టులను.. రాతపరీక్షల్లో తరువాత అర్హత సాధించిన వారితో భర్తీ చేయాలని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ను ఆదేశించింది. రాతపరీక్షలో తర్వాత అర్హత సాధించినవారికి స్తంభం ఎక్కడానికి నిర్వహించే పరీక్షకు కాల్ లెటర్లు పంపాలని, తరువాత నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం మిగిలిన పోస్టుల్లో నియమించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని తెలిపింది. 

తెలంగాణలో 2018లో 2,553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి ఎన్‌పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో వ‌రంగ‌ల్-575, క‌రీంన‌గ‌ర్-674, ఖ‌మ్మం-365, నిజామాబాద్-500, ఆదిలాబాద్-439 ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిలో 2,325 ఖాళీలను భర్తీ చేశారు. రాత‌ప‌రీక్ష, పోల్ క్లైంబింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేశారు. ఇన్‌స‌ర్వీస్ అభ్యర్థుల‌కు సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకున్నారు.


రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పోల్ క్లైంబింగ్ నిర్వహించి 2,325 మంది అభ్యర్థులను ఎంపికచేసింది. మిగిలిన 228 పోస్టుల్లో అర్హత సాధించినా.. తమకు స్తంభం ఎక్కడానికి పరీక్షకు కాల్ లెటర్లు పంపకపోవడాన్ని సవాలు చేస్తూ కె.శ్రీరాం మరో 12 మంది 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సీహెచ్. ప్రభాకర్ వాదనలు వినిపించారు.


తెలంగాణలో మొత్తం 2,553 లైన్‌మ్యాన్ ఉద్యోగాలకు గతేడాది ఫిబ్రవరి 16న టీఎస్ఎన్‌పీడీసీఎల్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు ఏప్రిల్ 8న రాతపరీక్ష నిర్వహించింది. రాతపరీక్షలో ఎంపికైన వారికి పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక జాబితాను 2019, జనవరి 18న సంస్థ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో వరంగల్-575, కరీంనగర్-674, ఖమ్మం-365, నిజామాబాద్-500, ఆదిలాబాద్-439 పోస్టులను కేటాయించారు. ఎంపికైనవారిని ప్రధాన కేంద్రమైన ఆయా సర్కిళ్లలో విధుల్లో నియమించింది.


'గ్రూప్‌-4' పోస్టుల నియామకంపైనా కీలక ఆదేశాలు..
తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టుల నియామకాల్లో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియను ఖరారు చేయొద్దంటూ.. రాష్ట్రం ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా అర్హత మార్కులను తగ్గించాలన్న సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ వినతిపై నిర్ణయం తీసుకునేదాకా ఈ ప్రక్రియ ఆపాలని పేర్కొంది.


రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధశాఖల్లో 'గ్రూప్‌-4' పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరులో టీఎస్‌పీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి నియామకాల్లో ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు అర్హత మార్కులు తగ్గింపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బి.భాస్కర్‌ మరో 9 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. 


విచారణలో భాగంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా తమకూ అర్హత మార్కులను 30 శాతానికి తగ్గించాలంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శికి, టీఎస్‌పీఎస్సీకి సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ లేఖలు రాశారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీ, రాష్ట్రహోంశాఖల మధ్య సంప్రదింపులు జరిగాయని అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. నిర్ణయం వెలువడక ముందే నియామకాలు జరిగితే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద పోస్టుల కోసం ఇప్పటికే రాత పరీక్షలకు హాజరయ్యామన్నారు.


ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డైరెక్టర్‌ లేఖ ఆధారంగా అర్హత మార్కులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోరాదని ఆదేశాలు జారీచేశారు. అర్హత మార్కుల తగ్గింపుపై ఈ ఉత్తర్వులు అందిన 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..