బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశె, ఉప్మా, బోండాలే గుర్తుకొస్తాయి. నాన్ వెజ్ ప్రియులకు టేస్టీ నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్‌లు ఉన్నాయి. వీటిని చేసుకోవడం కూడా చాలా సులువు. రొయ్యలతో టేస్టీ పోహా చేసుకోవచ్చు. మహారాష్ట్రాలో ఎంతో మంది ఈ రొయ్యల పోహాని తినేందుకు ఇష్టపడతారు. ఒక్కసారి దీన్ని తిన్నారంటే పదే పదే తినాలనిపిస్తుంది. 


కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - పది (మీడియం సైజువి)
అటుకులు - రెండు కప్పులు 
ఉలిపాయ - ఒకటి
పచ్చి బటాణీలు - 15
కరివేపాకులు - గుప్పెుడ
ఆవాలు - ఒక స్పూను
పసుపు - అర స్పూను
నూనె - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం తురుము - అర స్పూను
పచ్చిమిర్చి - రెండు
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను


తయారీ ఇలా
1. రొయ్యలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి రొయ్యలను బాగా వేయించుకోవాలి. కాస్త పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 


2. ఆ కళాయిలో నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, కరివేపాకులు వేసి వేయించాలి. అందులో పచ్చిబఠాణీలు, ఉల్లితరుగు వేసి వేయించాలి. 


3. అన్నీ బాగా వేగాక అందులో ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి వేయించాలి. కొత్తి మీర తురుమును చల్లి బాగా కలపాలి. 


4. పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. అటుకులను పదినిమిషాల ముందు నానబెట్టుకోవాలి. నీళ్లలో నుంచి అటుకును తీసి చేత్తోనే బాగా పిండి కళాయిలోని మిశ్రమంలో వేయాలి. 


5. గరిటెతో మిశ్రమాన్ని బాగా కలపాలి. కావాలనుకుంటే నిమ్మరసం పైన చల్లుకోవచ్చు. అంతే రొయ్యల పోహా రెడీ అయినట్టే. దీని టేస్టు చాలా బావుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. 


చికెన్, మటన్ వంటి మాంసాహారాలతో పోలిస్తే రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రొయ్యలో నాణ్యత కలిగిన ప్రొటీన్ ఉంటుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్న వారు కచ్చితంగా రొయ్యలను తినడం అలవాటుగా మార్చుకోవాలి. పిల్లలకు రొయ్యలు తినిపించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ... వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి.  వారానికి ఒకసారైనా రొయ్యలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో టేస్టీ రొయ్యల బిర్యాని, రొయ్యల పలావ్, వేపుడు, కూర... ఇలా రకరకాల వంటలు వండుకోవచ్చు.


Also read: సల్మాన్ ఖాన్‌ను వేధిస్తున్న సమస్య ఇదే, దీంతో ఆత్మహత్యా ఆలోచనలు పెరిగిపోతాయి


Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.