బ్లాక్ బెర్రీ పండ్లను మనం చాలా తక్కువగా తింటాం కానీ విదేశాల్లో మాత్రం వీటిని అధికంగా తింటారు. అక్కడ ఇవి ఎక్కువగా పండుతాయి. బ్లాక్ బెర్రీలను తినడం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. బ్లాక్ బెర్రీలలో ఆంథోసినిన్స్ అనే మూలకాలు ఉంటాయి. ఇవి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. వీటివల్లే బ్లాక్ బెర్రీలకు ఆ ముదురు రంగు వస్తుంది. వీటి వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. దీనిలో విటమిన్ సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది.
ఈ పండ్లను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే క్యాన్సర్ ముప్పును తగ్గించే శక్తి దీనికి ఉంది. ఈ బ్లాక్ బెర్రీలను తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణుపులు పెరగకుండా అడ్డుకుంటాయని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అలాగే క్యాన్సర్ ఒక అవయవం నుండి మరొక అవయవానికి వ్యాప్తి చెందకుండా ఇవి అడ్డుకుంటాయని పరిశోధన కర్తలు చెబుతున్నారు. కాబట్టి బ్లాక్ బెర్రీలను అప్పుడప్పుడు తినాల్సిన అవసరం ఉంది. మెదడు ఆరోగ్యానికి కూడా బ్లాక్ బెర్రీలు చాలా ముఖ్యం. దీనిలో మాంగనీస్ అధికంగా ఉంటుంది. మెదడు పనితీరుకు మాంగనీస్ అవసరం. మాంగనీస్ లోపిస్తే మెదడు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెదడు కోసం కూడా బ్లాక్ బెర్రీలను తినాల్సిందే.
ఈ పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు బ్లాక్ బెర్రీలను తరుచూ తింటూ ఉండాలి. పొట్టలో ఉండే అల్సర్లను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. అల్సర్ల వల్ల కలిగే మంటను దాదాపు 88% ఈ బ్లాక్ బెర్రీలు తగ్గిస్తాయని ఒక అధ్యయనం నిరూపించింది. నోటి ఆరోగ్యానికి కూడా ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను పోగొడతాయి. అలాగే దంత ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. బ్లాక్ బెర్రీలను ఎవరికీ పడకపోవడం అనేది ఉండదు. వీటివల్ల అలర్జీలు రావడం అరుదుగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్లాక్ బెర్రీలను తినవచ్చు.
ఈ పండ్లలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరం. అంటువ్యాధులు రాకుండా ఇది అడ్డుకుంటాయి. చర్మ సౌందర్యానికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తింటూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
Also read: వారాలు గడుస్తున్నా జలుబు తగ్గడం లేదా? అయితే మీకు లాంగ్ కోల్డ్ సమస్య ఉన్నట్టే
Also read: తిన్నది అరగకపోవడం చిన్న సమస్య కాదు, క్యాన్సర్ సంకేతం కావచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.