అరుదైన వ్యాధుల జాబితాలో ఒకటి ఫాంటమ్ ఫేస్ పెయిన్. శాస్త్రీయంగా దీన్ని ట్రెజిమినల్ న్యూరల్జియా అని పిలుస్తారు. అలాగే ట్రైఫేషియల్ న్యూరాల్జియా అని కూడా అంటారు. ఈ వ్యాధితోనే సల్మాన్ ఖాన్ ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నాడు. ఇది ముఖంలోని నరాలకు వచ్చే ఒక వ్యాధి. కపాలం నుంచి ముఖానికి వెళ్లే ట్రైజిమినల్ నాడి ఈ వ్యాధి బారిన పడుతుంది. దీనివల్ల ముఖంలోని ఎడమవైపు లేదా కుడివైపు విపరీతమైన నొప్పి వస్తుంది. అరగంట నుంచి గంట వరకు ఈ నొప్పిని తట్టుకోవాల్సి వస్తుంది. నోరు, దవడ కూడా కదపలేరు. ఈ నొప్పి ఎంత సేపు ఉంటుందనేది కూడా చెప్పలేం. కొందరికి మూడు గంటల వరకు ఉండొచ్చు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తగ్గుతుందో చెప్పడం కష్టం. తినడం, బ్రష్ చేయడం, నీళ్లు తాగడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య బారిన పడినవారు మానసికంగా చాలా కృంగిపోతారు. వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పెరిగిపోతాయి. ఈ వ్యాధి బారిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పడ్డారు. ఈ వ్యాధికి అమెరికా వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకుని వచ్చారు. ఇది చాలా ఖరీదైన శస్త్ర చికిత్స.


వైద్యులు చెబుతున్న ప్రకారం ఇది 50 ఏళ్ల వయసు దాటాక వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స చేయడం కూడా చాలా కష్టం. ముఖం పై వివిధ రకాల చర్మ సమస్యలకు కారణం అవుతుంది. ముఖంపై పుండ్లు పడే అవకాశం ఉంది.  దంతాల్లో, చిగుళ్లలో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. ముఖంపై వచ్చే ఆకస్మిక నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. దీనికి శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఆపరేషన్ చేయించుకున్నా పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందని లేదు. దీని సక్సెస్ శాతం 70 మాత్రమే. 30% శస్త్ర చికిత్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ నొప్పిని తట్టుకునేందుకు చాలా శక్తివంతమైన యాంటీ బయోటిక్ మందులు వినియోగించాలి. అవి వేసుకున్నాక కడుపులో తిప్పినట్టు, కళ్ళు తిరిగినట్టు అవుతాయి. ఆహారం కూడా తినాలనిపించదు. అంత శక్తివంతమైన యాంటీ బయోటిక్స్‌ను శరీరం కూడా తట్టుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంది. సల్మాన్ ఖాన్ ఈ సమస్యను అధిగమించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నట్టు ఒక మీడియా సమావేశంలో చెప్పారు. తనని తాను బిజీగా ఉంచుకొని ఈ సమస్య గురించి ఆలోచించకుండా చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నట్టు ఆయన వివరించారు. 


ఈ వ్యాధి రావడానికి కారణం కపాలం నుంచి ముఖానికి వెళ్లే నరాలు దెబ్బతినడం. నరాలు పనిచేయకపోవడం వల్ల నొప్పి,తిమ్మిరి వస్తూ పోతూ ఉంటాయి. ప్రపంచంలో ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నొప్పిని భరించలేక ఎంతో మంది ఆత్మహత్యా చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. 


Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.