TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 1663 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేసింది. ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో 1522 పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. ఇప్పటి వరకు 46,998 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. మరిన్ని పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తుంది.
1663 పోస్టుల భర్తీ
తెలంగాణ ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు గుడ్ న్యూస్
ఇంజినీరింగ్ పట్టభద్రులకు శుభవార్త. ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి ప్రభుత్వం క్లియెరెన్స్ ఇచ్చింది. ఇంజినీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్(అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్)లో 1238 పోస్టులు, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఆర్ అండ్ బి, ఎన్.హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ఆర్యూబీఎస్, హెచ్వోడీ) లో284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్ హెచ్వోడీలో 53 , డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ (హెచ్వోడీ)లో 88 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
మరికొన్ని నోటిఫికేషన్లు సిద్ధం
తాజా పోస్టులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేందుకు కసరత్తును ఆర్థికశాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరికొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేయనుంది.
Also Read : Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు