Defence Ministry: ఇండియన్ ఆర్మీ, నేవీ అగ్నిపథ్ పథకం కింద తమ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను ప్రారంభించాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత వైమానిక దళం జూన్ 24న ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించిందని, గురువారం వరకు 2.72 లక్షల దరఖాస్తులు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. జూన్ 14 అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన అనంతరం దాదాపు ఒక వారం పాటు అనేక రాష్ట్రాలలో ఆందోళనలు జరిగాయి. సికింద్రాబాద్, బిహార్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. అగ్నివీరుల రిక్రూట్మెంట్ కు దరఖాస్తులు నమోదుకు ఆహ్వానించింది. 






నేవీలో రిక్రూట్మెంట్ ప్రారంభం 


నేవీలో అగ్నివీరుల రిక్రూట్మెంట్ ఇవాళ్టి నుంచి మొదలైందని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొంది. "ఇండియన్ ఆర్మీలో చేరండి. అగ్నివీర్‌గా దేశానికి సేవ చేయాలనే మీ కలను నెరవేర్చుకోండి. జులై 1 నుంచి అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది" అని అందులో పేర్కొంది. అగ్నిపథ్ పథకం కింద పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్సు గల యువకులు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేస్తారు. అయితే వారిలో 25 శాతం మంది తరువాత సాధారణ సేవ కోసం కొనసాగిస్తారు. ఈ పథకం కింద రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచిందనట్లు జూన్ 16న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాలు, డిఫెన్స్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామని ఉపశమన చర్యలు ప్రకటించింది కేంద్రం. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అగ్నిపథ్ పథకం కింద పనిచేసిన సైనికులను రాష్ట్ర పోలీసు బలగాలలో తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి. కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు, అగ్నిప్రమాదాలకు పాల్పడిన వారిని చేర్చుకోబోమని సాయుధ దళాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.


Also Read : Agnipath Recruitment Notification 2022: అగ్నిపథ్‌ నియామకాల్లో కేంద్రం దూకుడు- కీలక నోటిఫికేషన్ విడుదల