Nizamabad News : నిజామాబాద్ జిల్లా ధ‌ర్పల్లి మండ‌లం దుబ్బాక గ్రామంలో విద్యార్థుల‌ను ప్రభుత్వ పాఠ‌శాల‌కే పంపాలని ప్రైవేట్ పాఠ‌శాల‌కు పంపంవ‌ద్దని గ్రామాభివృద్ధి క‌మిటీ చాటింపు వేయించింది. దీంతో ఓ ప్రైవేట్ స్కూల్ య‌జ‌మాని సాయి కృష్ణ త‌న స్కూల్ కు విద్యార్థులు రాకుండా అడ్డుకుంటున్నార‌ని వాటర్ ట్యాంక్ ఎక్కారు. దీంతో గ్రామ‌స్తులు, పోలీసులు సాయి కృష్ణకు స‌ర్ది చెప్పి వాట‌ర్ ట్యాంక్ దించారు. 


గ్రామాభివృద్ధి కమిటీ కట్టడి


ప్రభుత్వ పాఠ‌శాల గ్రామంలో కొన‌సాగాలంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటేనే స్కూల్ ఉంటుందని, లేదంటే క‌ష్టం అవుతుంద‌ని ఎంఈవో చెప్పారని గ్రామాబివృద్ధి క‌మిటీ సభ్యులు చెబుతున్నారు. దీంతో గ్రామ‌స్తులంతా క‌లిసి ప్రతి ఒక్కరు స‌ర్కార్ స్కూలుకే విద్యార్థుల‌ను పంపాల‌ని నిర్ణయించామన్నారు. అయితే గ్రామంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ య‌జ‌మాని తనకు న‌ష్టం జ‌రుగుతుందని వాపోయాడు. దీంతో తల్లిదండ్రులు విద్యార్థుల‌ను పంప‌కుండా గ్రామాభివృద్ధి కమిటీ క‌ట్టడి చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే ఫీజులు క‌ట్టిన వారు తిరిగి ఇవ్వాల‌ని వేధిస్తున్నార‌ని సాయి కృష్ణ ఆవేద‌న వ్యక్తం చేశారు. విద్యార్థుల‌ను వారికి ఇష్టం వ‌చ్చిన చోట చ‌దివించుకునే స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఉంద‌ని ఎస్ఐ అన్నారు. 


హెచ్ఎం వినూత్న నిరసన 


పిల్లల్ని బ‌డికి పంపాల‌ని సంగారెడ్డి జిల్లాలో ఓ హెడ్ మాస్టర్ వినూత్న ప్రయత్నం చేశారు. బడి మానేసిన పిల్లలను బడికి పంపేవరకూ తిరిగి వెళ్లేదేలేదని వాళ్ల ఇళ్ల వద్ద ప్రధానోపాధ్యాయుడు నేలపై పడుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పిల్లల్ని పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను వేడుకున్నారు. వారి ఇంటిముందే పడుకుని నిర‌స‌న తెలిపారు. దీంతో త‌ల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు పంపిస్తామని చెప్పారు. ఈ వినూత్న ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్నది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ నూలి శ్రీధర్రావు, తోటీ ఉపాధ్యాయులను వెంట బెట్టుకుని బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లారు. 2021-22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి పూర్తి చేసిన పిల్లలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో చేరాల్సి ఉంది. 


అయితే కొందరు విద్యార్థులు పనులకు వెళ్తుంటే, మరికొందరు అనారోగ్యంతో పాఠశాలలకు వెళ్లడంలేదు. మరికొంత విద్యార్థులు పాఠశాలలకు రావడంలేదు. దీంతో హెచ్ఎం శ్రీధర్రావు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడికి పంపాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కొందరు తల్లిదండ్రులు వినకపోవడంతో వారి ఇంటి ముందు నేలపై కూర్చుని, పడుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చివరకు పిల్లలను తిరిగి పాఠశాలకు వచ్చేలా చేసి అందరి ప్రశంసలు పొందారు.