దేశ అత్యున్నత సర్వీసుల్లో ఒకటైన 'సివిల్ సర్వీసెస్ పరీక్ష'కు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్-19 తీవ్రత, ఆ తర్వాత విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఒక ఏడాది కోల్పోయిన అభ్యర్థులకు వయోసడలింపు ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ సింగ్‌ హుడా అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ రాజ్యసభకు ఆగస్టు 10న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ప్రయత్నాల సంఖ్య, వయోపరిమితికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడం సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు.


కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నిబంధనలకు అనుగుణంగానే 'సివిల్ సర్వీసెస్ పరీక్ష'ను యూపీఎస్సీ ఏటా నిర్వహిస్తుందని మంత్రి చెప్పారు. కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, డిపార్ట్‌మెంట్ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను సిబ్బంది, శిక్షణ శాఖ పరిశీలించిందని మంత్రి అన్నారు. అయితే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు హాజరయ్యేందుకు ఉన్న అవకాశాలు, వయోపరిమితి విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనల్లో సడలింపులు ఇవ్వడానికి వీలు పడటంలేదన్నారు. 


సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలకు తేదీలు నిర్ణయించడంతో పాటు పరీక్ష కేంద్రాలను యూపీఎస్సీనే నిర్ణయిస్తుందని మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ 2023 పరీక్ష మే 28న నిర్వహించగా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పరీక్షలో 14,624 మంది అర్హత సాధించారని.. ఫెయిల్‌ అయిన కొందరు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారని ఆయన చెప్పారు.


ALSO READ:


పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 30 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి !!
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో 1,058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC Civil Services: యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ 2023 షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెష‌న్లలో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా  మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించగా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ ప‌రీక్షలో మొత్తం 14,624 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...