తెలంగాణ వ్యాప్తంగా జూన్‌ 11న నిర్వహించిన 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది. పరీక్ష తర్వాత 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై వివరణ ఇస్తూ సెప్టెంబర్‌ 28న కమిషన్ ప్రకటన జారీ చేసింది. పరీక్ష రోజు కలెక్టర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకటన ఇచ్చామని, మొత్తం 2,33,248 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాసినట్లు తెలిపామని పేర్కొంది. పరీక్ష పారదర్శకత కోసం అదే విషయాన్ని మీడియాకు తెలిపినట్లు కమిషన్ వెల్లడించింది.


ఓఎంఆర్‌ స్కానింగ్‌లో 2,33,506 మంది పరీక్ష రాశారని, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో నిర్వహింనట్లు కమిషన్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా నుంచి లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలు రాశారని.. ఇలా లక్షల మంది పరీక్ష రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు ఉండటం సహజమే అని తెలిపింది. స్కానింగ్‌ తర్వాత తుది సంఖ్య ప్రకటించామని, పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది.


ఆ తీర్పు సబబే..
'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సబబేనని హైకోర్టు సెప్టెంబర్‌ 27న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గతంలో ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించినపుడు మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని, అలా తీసుకున్నట్లు కనిపించలేదంది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. పరీక్షను రద్దు చేసి తిరిగి నిబంధనల ప్రకారం నిర్వహించాలన్న సింగిల్‌ జడ్జి నిర్ణయం సమర్థనీయమేనని జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది.


గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !
తెలంగాణలో మరోసారి గ్రూప్‌వన్‌ పరీక్ష ప్రిలిమ్స్‌ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన  తీర్పును సవాల్ చేస్తూ.. ప్రభుత్వం  దాఖలు చేసిన రిట్  పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో గ్రూప్ 1 పరీక్ష  మరోసారి నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  జూన్‌ 11న గ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్‌ రెండోసారి నిర్వహించారు. అందులో కూడా అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. 503 పోస్టులతో విడుదల చేసిన నోటిఫికేషన్‌ కోసం రెండుసార్లు ఎగ్జామ్ రాశారు.  లీకేజీ ఆరోపణలతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మొదటి సారి గ్రూప్‌ - 1 పరీక్షను రద్దు చేసింది. పకడ్బంధీగా రెండోసారి నిర్వహించాలని భావించారు. రెండోసారి పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు తలెత్తాయి. వీటిని పాయింట్‌ అవుట్ చేస్తూనే కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని... హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..