ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ అన్నంత ప‌నీ చేశారు. ఈ ఏడాదిలో అతిపెద్ద 'లేఆఫ్స్'కు తెరతీస్తూ.. ఉద్యోగాల కోత మొదలుపెట్టారు. ఉద్యోగుల సంఖ్యను 13 శాతం మేర తగ్గించుకుంటున్నట్లు నవంబరు 9న ప్రకటించారు. తొలి ద‌శ‌లో కంపెనీలో పనిచేస్తున్న 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల తొలగింపు విషయాన్ని మెటా చరిత్రలో కఠినమైన రోజుగా జుకర్‌ బర్గ్ అభివర్ణించారు. ఇకపై కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామన్నారు. 


మెటా ఉద్యోగుల‌కు పంపిన మెయిల్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన మేర‌కు ఈ నిర్ణయాల‌కు త‌న‌దే బాధ్యత‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరికి సంక్లిష్ట స‌మ‌య‌మ‌ని త‌న‌కు తెలుస‌ని, ఈ నిర్ణయం ప్రభావానికి గురైన వారంద‌రికీ తాను క్షమాప‌ణ చెబుతున్నాన‌ని అన్నారు. ప్రక‌ట‌నల రాబ‌డి త‌గ్గడంతో ఈ నిర్ణయం తీసుకోక త‌ప్పలేద‌ని వివ‌రించారు. కంపెనీ ఖ‌ర్చుల‌ను తగ్గించుకోవ‌డంపై దృష్టిసారిస్తామ‌ని, ఈ క్రమంలో వ‌చ్చే ఏడాది తొలి క్వార్టర్ వ‌ర‌కూ నియామ‌కాల ప్రక్రియ నిలిపివేస్తామ‌ని చెప్పారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు ఈ సందర్భంగా క్షమాపణ చెప్పారు. 2004లో ఫేస్‌బుక్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలను తొలగించడం ఇదే తొలిసారి. 


Also Read: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే రూ.7 లక్షల ప్రయోజనం పొందండిలా!


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వర్టైజింగ్, మెటావర్స్ వంటి అధిక ప్రాధాన్య వృద్ధి అవకాశాలపై మరింత దృష్టి పెడతామని జుకర్‌బర్గ్ చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి చోటా ఖర్చు తగ్గించుకుంటామని.. భవనాలు, కార్యాలయాల ఖర్చులు తగ్గిస్తామని.. డెస్క్ షేరింగ్ అనేది పెంచుతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మెటాలో సుమారు 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 


16 వారాల వేతనం
కంపెనీ నుంచి ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఆ మేరకు ఈ-మెయిల్ వస్తుందని జుకర్‌ బర్గ్ తెలిపారు. వారి కంప్యూటర్లకు యాక్సెస్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే తొలగింపునకు గురైన ఉద్యోగులకు 16 వారాల వేతనం లభిస్తుందని చెప్పారు. కంపెనీలో పనిచేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల చొప్పున అదనపు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే తొలగించిన ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు ఆరు నెలల వరకు ఆరోగ్య బీమా కొనసాగుతుందని జుకర్ పేర్కొన్నారు. ఇతర దేశాల్లోని మెటా ఉద్యోగులకూ ఇదే వర్తించినా అక్కడి చట్టాల ప్రకారం స్వల్ప మార్పులు ఉండొచ్చని సంస్థ వెల్లడించింది.


Also Read: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే రూ.7 లక్షల ప్రయోజనం పొందండిలా!


ఇదే దారిలో మరిన్ని కంపెనీలు...
మరోవైపు సిలికాన్ వ్యాలీకి చెందిన ఇతర కంపెనీలు సైతం నియామకాలను తగ్గించుకోవాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఇటీవల ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ సైతం సగం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఆర్ధిక మాంద్యం భ‌యాలు వెంటాడుతుండ‌టం, మంద‌గ‌మ‌నం నేప‌ధ్యంలో టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు దిగుతున్నాయి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...