Job Recruitment In Police And Health Department : తెలంగాణలో వెంటనే హోంగార్డుల నియామకాలు (Home Guard Recruitment) చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు హోంగార్డుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పోలీసు, వైద్యారోగ్యశాఖలో నియామకాలపై డిసెంబరు 15న సీఎం సమీక్ష నిర్వహించారు. పోలీసు నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నియామకాలను పారదర్శకంగా, అవకతవకలు లేకుండా చేపట్టాలని సూచించారు. 


రాష్ట్ర ఆవిర్భావం నుంచి జరిగిన ఉద్యోగ నియామకాలపై సీఎం ఈ సందర్భంగా నివేదిక కోరారు. నియామక ప్రక్రియలో లోటుపాట్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని సీఎం అన్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పోలీసు నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 


నళినికి ఉద్యోగం ఇవ్వాలన్న సీఎం.. ఆమె ఏమందంటే?
తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీసు శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీసు శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో మరో శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా.. చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. అయితే ఈ విషయంలోపై నళిని స్పందిస్తూ.. ఇప్పుడు తాను పోలీసు ఉద్యోగానికి ఫిట్ కానని తెలిపారు. 


 ALSO READ:


టీఎస్‌పీఎస్‌సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ, సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(TSPSC)లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. శాసనసభలోని తన కార్యాలయంలో సీఎం గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. TSPSC పేపర్ లీకేజీలు, పోటీ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు సంబంధించి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేను రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున అభ్యర్థన చేస్తామని ఆయన అన్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...