APPSC Group 1: రాష్ట్రంలో ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అయితే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయని, అలాంటి వదంతులు నమ్మవద్దని ఆయన కోరారు. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సెంటర్ల కొరత వచ్చే అవకాశం లేదన్నారు. మార్చి 17న గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ స్పష్టంచేశారు.


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (ఫిబ్రవరి) నిర్వహించిన గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 899 పోస్టులకు ఏపీపీఎస్సీ ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష నిర్వహణ తీరును కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. గ్రూప్-2 పరీక్షకు 4,83,535 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ నమోదు కాలేదన్నారు. కానీ చిత్తూరు జిల్లాలో ఫేక్‌ హాల్‌టికెట్‌తో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని సవాంగ్ తెలిపారు. జూన్‌ లేదా జులైలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 


గ్రూప్-2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30. గంటలకు ప్రారంభమైన ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. పరీక్ష నిర్వహణకు 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. పరీక్ష కేంద్రాల్లో 24,142 మంది ఇన్విజిలేటర్లను, 8500 ఇతర సిబ్బందిని నియమించింది.


ఆంధ్రప్రదేశ్‌‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జవనరి 17తో గడువు ముగియనుంది. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...