తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఎత్తు విషయంలో అనుత్తీర్ణులైన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) గుడ్ న్యూస్ తెలిపింది. పీఈటీ/ పీఎంటీ పరీక్షల్లో 1 సెం.మీ., అంతకంటే తక్కువ ఎత్తులో అనుత్తీర్ణులైన అభ్యర్థులకు మరోసారి పీఎంటీ/ పీఈటీ కోసం దరఖాస్తు చేసుకోవాలని నియామక మండలి సూచించింది. ఈ అభ్యర్థులు ఫిబ్రవరి 10న ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 12న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలని బోర్డు స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు పత్రం, అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అంబర్‌పేట్ (హైదరాబాద్) పోలీస్ గ్రౌండ్స్, కొండాపూర్(రంగారెడ్డి జిల్లా)లోని బెటాలియన్‌లో పీఎంటీ/ పీఈటీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ ముగిశాయి. కేవలం మెయిన్స్ పరీక్షలు మాత్రమే మిగిలాయి. అయితే ఫిజికల్ ఈవెంట్స్‌లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాలేకపోయిన చాలా మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఫైనల్ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (IT&CO) టెక్నికల్ పేపర్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ ఏఎస్‌ఐ(FPB) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.
➥ మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (PTO) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.
➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.
➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.
➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.
➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు.
మెయిన్ పరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి 5 వరకు ఫిజికల్ ఈవెంట్లు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన ఫలితాలను జనవరి 6న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2018-19లో జరిగిన రిక్రూట్‌మెంట్‌తో పోల్చితే, ఇప్పుడు అదనంగా 5.18 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 12 నుంచి తుది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9న సివిల్ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.