ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6,511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. వీటిలో 483 ఎస్‌ఐ పోస్టులు, 6028 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్ విభాగంలో.. ఎస్‌ఐ(సివిల్)-387, ఎస్‌ఐ (ఏపీఎస్‌పీ)-96 పోస్టుల ఉన్నాయి. ఇక  కానిస్టేబుల్ ఉద్యోగాల్లో.. కానిస్టేబుల్ (సివిల్)-3508,  కానిస్టేబుల్ (ఏపీఎస్‌పీ)-2520 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబరు నెలాఖరులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబరు నాటికి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తిచేయనున్నారు. 2023 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అనంతరం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు.


Also Read: తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!


పోస్టుల భర్తీకి సీఎం జగన్ అంగీకరం తెలిపారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. జులైలోనే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పోలీస్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఖాళీలు, రాష్ట్ర అవసరాలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు. ఖాళీలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ సమాచారం సేకరించి రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.


దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీనికే  ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మిగతా పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఆంధ్రప్రదేశ్ లేదా ఏపీ నివాస రుజువు ఉన్న దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి. ఇతర రాష్ట్రాల నుండి 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు గరిష్ట వయోపరిమితిలో వయో సడలింపులను అందిస్తుంది.


Also Read: త్వరలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు! రిజల్ట్ తర్వాత ఇవి తప్పనిసరి!


కానిస్టేబుల్ పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులు. ప్రిలిమినరీ పరీక్ష అనేది బహుళ ప్రశ్నలతో కూడిన రాత పరీక్ష, అయితే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఒక అభ్యర్థి భౌతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ  పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు  కలిగి ఉన్న పరీక్ష.


🔰 ప్రిలిమ్స్ పరీక్ష విధానం: ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.


🔰 మెయిన్ పరీక్ష విధానం: మెయిన్ పరీక్షలోనూ 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 3 గంటలు. ప్రధాన పరీక్షలో ఇంగ్లిస్, అరిథ్‌మెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ,పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...