Telangana Priyanka Gandhi : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఆ పార్టీ హైకమాండ్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లాలని సలహాలు, సూచనలు మరీ ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ విషయంలో ఫెయిలయ్యారు. అందర్నీ కలుపుకుని వెళ్లలేకపోతున్నారు. ఫలితంగా ఆయన నాయకత్వం కింద పని చేయడం ఇష్టం లేక.. దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. దీంతో ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాలని కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నుంచి నేరుగా తెలంగాణ వ్యవహారాలను తానే స్వయగా చూసుకోవాలని ప్రియాంకా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
అందర్నీ కలుపుకుని వెళ్లడంలో రేవంత్ రెడ్డి విఫలం !
పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియ్ర నేతలందర్నీ ఇంటికి వెళ్లి కలిశారు . ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే ఆయనను కలిసేందుకు నిరాకరించారు. ఆయన పదవి కొనుక్కున్నారని ఆరోపించారు. తర్వాత ఆయనకు స్టార్ క్యాంపెయినర్ పదవి ఇవ్వడంతో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానన్నారు. అన్నీ సర్దుబాటు అయ్యాయనుకునేలోపే మళ్లీ నేతలంతా రేవంత్ నాయకత్వంపై విమర్శలు ప్రారంభించారు. జగ్గారెడ్డి మొదట్లో సానుకూలంగా ఉన్నా. వర్కంగ్ ప్రెసిడెంట్‌నైన తనకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. కనీసం తమ జిల్లాకు వచ్చినప్పుడు కూడా సమాచారం ఇవ్వడం లేదని ఫైరవడం ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న స్ట్రాటజిస్ట్ ఇస్తున్న సర్వేలు.. నివేదికలు.. రేవంత్ రెడ్డి తీసుకొచ్చి చేర్పిస్తున్న చేరికలు అన్నీ.. సీనియర్లకు నచ్చలేదు. కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి.. మునుగోడు ఉపఎన్నికలను తీసుకురావడంతో పరిస్థితి మరింత దిగజారింది. సీనియర్లంతా రేవంత్ రెడ్డినే గురి పెట్టి విమర్శలు చేస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మొదట్లో అందర్నీ కలిసి .. కలిసి పని చేద్దామన్న రేవంత్ తర్వాత వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే పని చేస్తున్నారని వారు ఆరోపించడం ప్రారంభించారు. ఈ విషయంలో రేవంత్ పై హైకమాండ్ వద్ద మైనస్ మార్కులే పడ్డాయి.
ద్వితీయ శ్రేణి నేతల కోసం కాంగ్రెస్‌వైపే చూస్తున్న బీజేపీ !
భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఇప్పుడు ఊపు వచ్చింది. ప్రధాన పోటీదారుగా మారామని గట్టి నమ్మకంతో ఉంది. కానీ ఆ పార్టీకి కింది స్థాయిలో క్యాడర్ లేదు. నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి బలమైన నాయకులు లేరు. అందుకే చేరికలపై దృష్టి పెట్టింది. టీఆర్ఎస్ నుంచి నేతల్ని చేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. చివరికి కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. మరో వైపు సమయం దగ్గర పడుతోంది. దీంతో బీజేపీ.. కాంగ్రెస్ నేతల్నే ఆకర్షించాలని నిర్ణయించుకుంది. మర్రి శశిధర్ రెడ్డితో పాటు .. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో చాలా ఊపు వందని.. వచ్చి చేరితే మంచి భవిష్య్త ఉంటుందని కీలక నేతలకు ఆఫర్లిస్తున్నారు. కొంత మందికాంగ్రెస్ నేతలు ఊగిసలాటలో ఉన్నారు .వీరిలో ఎక్కువ మంది సీనియర్లే.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రియాంకా గాంధీ ప్రయత్నం !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంతకూగాడిన పడకపోతూండటం... పార్టీ నేతల్ని చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తూండటంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. తెలంగాణ బాధ్యతలను ఇక స్వయంగా చూసుకోవాలని ప్రియాంకా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో ఏదైనా తనకే రిపోర్టు చేయాలని ప్రియాంకా గాంధీ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ సారి ఢిల్లీలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి పై ఎక్కువ నమ్మకం ఉంచి.. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. అయితే రేవంత్ ఎంత ప్రయత్నించినా సీనియర్లు ఆయనను అంగీకరించలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పుడుప్రియాంకా గాంధీ లీడ్ తీసుకుంటున్నారని అంటున్నారు.
కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించే చాన్స్ !
ప్రస్తుతం తెలంగాణ పీసీసీకి గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఆజారుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. వీరు పేరుకే వర్కింగ్ కానీ ఇటీవలి కాలంలో పని చేయడం ఎప్పుడూ చూడలేదు. అందుకే వీరికి వేర పదవులు ఇచ్చి కొత్త వారికి పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే.. కీలకంగా పని చేసే.. కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని కూడా నియమించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.