High Court order on SI Recruitment: ఏపీలో ఎస్‌ఐ పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎత్తు (Height Measurement) విషయంలో తమకు అన్యాయం జరిగిందని 22 మంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు (AP High Court) నవంబరు 29న కీలక తీర్పు వెలువరించింది. డిసెంబరు 4న హైకోర్టుల పర్యవేక్షణలో వారి ఎత్తు కొలవాలని కోర్టు ఆదేశించింది. పిటిషన్ వేసిన వారందరూ ఆరోజు కోర్టు ఎదుట హాజరుకావాలని తెలిపింది.


ఎస్‌ఐ నియామకాల్లో ఫిజికల్ మెజర్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన 'ఎత్తు' కొలతల  విషయంలో 2018లో అర్హత సాధించిన తమను 2023 నోటిఫికేషన్‌లో అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన 24 మందికి హైకోర్టు పర్యవేక్షణలో, న్యాయస్థానం ప్రాంగణంలోనే ఎత్తు కొలతలు తీసేందుకు గత విచారణలో నిర్ణయించింది. ఎత్తు విషయంలో నియామక బోర్డు చెబుతున్న వివరాలు వాస్తవమని తేలితే ఒక్కో పిటిషనర్‌ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎత్తు కొలతకు సిద్ధంగా ఉన్న పిటిషనర్ల వివరాలను కోర్టుకు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదికి సూచించింది. 


ఎస్‌ఐ పోస్టుల భర్తీలో 2023 నోటిఫికేషన్‌ ప్రకారం శారీరక దారుఢ్య పరీక్షల్లో భాగంగా డిజిటల్‌మెషీన్‌తో ఎత్తును కొలవడాన్ని సవాలు చేస్తూ 95 మంది అభ్యర్థులు హైకోర్టులో గతంలో పిటిషన్లు వేశారు. డిజిటల్‌ మెషీన్ల ద్వారా ఛాతి, ఎత్తు కొలతలు నిర్వహించడంతో తాము అనర్హులమయ్యామన్నారు. మాన్యువల్‌ విధానంలో కొలతలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2018 నాటి నోటిఫికేషన్లో ఎత్తు విషయంలో తాము అర్హత సాధించామని, ప్రస్తుతం ఏ విధంగా అనర్హులమవుతామని ప్రశ్నించారు.


వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. మాన్యువల్‌ విధానంలో కొలతలు తీయాలని పోలీసు నియామక బోర్డును ఈ ఏడాది అక్టోబరులో ఆదేశించింది. అందులో అర్హులైన వారిని ప్రధాన రాతపరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మాన్యువల్‌ విధానంలో ఎత్తు కొలతను నిర్వహించిన అధికారులు.. పిటిషనర్లు అందరిని అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో ఎ.దుర్గాప్రసాద్‌ మరో 23 మంది హైకోర్టులో తాజాగా పిటిషన్‌ వేశారు. నవంబరు 17న విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ఎస్ఐ ఫలితాలు ప్రకటించొద్దని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డును ఆదేశించారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసింది.


ఏపీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు.









ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply