ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తునన ఉద్యోగులను శుభవార్త తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌కార్డుల జారీప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్‌ కార్యాలయం మూడురోజుల కిందట ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకి లేఖ రాసింది. ఒకేసారి లక్షమందికిపైగా ఉద్యోగుల వ్యవహారం కావడంతో ఈహెచ్ఎస్‌కు ప్రత్యేక కసరత్తు చేస్తోంది.  ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) పరిధిలోకి తీసుకొస్తోంది.


రాష్ట్ర ముఖ్యమంత్రిగా  జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే.. రికార్డుస్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇటీవలే అర్హులైన సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్‌ను కూడా ఖరారు చేసింది. ఇప్పుడు ఒకేసారి లక్షమందికిపైగా ఉద్యోగులను ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి తీసుకొస్తోంది. అర్హులైన సచివాలయాల ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్‌ఎస్‌ కార్డుల జారీకి గ్రామ, వార్డు సచివాలయశాఖ చర్యలు చేపట్టింది.


2019లో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 1 లక్షా 35వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో 1.21 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ రూ.15వేల స్టైఫండ్ ఇచ్చిన ప్రభుత్వం... గతేడాది నవంబర్ లో ప్రొబేషన్ ఖరారు కోసం పరీక్షలు నిర్వహించింది. పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు చూస్తే.. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5కి 23,120-74,770గా ఖరారు చేశారు. మిగిలిన పోస్టులకు రూ.22,460-72,810గా ఫిక్స్ చేశారు. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి రూ. 23,120-74,770గా పేర్కొంది. ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ, డీఏలు అదనంగా రానున్నాయి.



కారుణ్య నియామకాలు...

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రొబేషన్‌ పీరియడ్‌లో విధులు నిర్వహిస్తూ.. మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్ అంగీకరించగా.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ అక్టోబరు 27న కారుణ్య నియామకాలకు  సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నారు.


మరో కీలక బాధ్యత అప్పగింత..
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వం మరో కీలక  బాధ్యతను అప్పగిస్తోంది.  ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ బాధ్యత మొత్తం వారికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రైతు పండించిన ధాన్యం కళ్లాల్లో ఉన్నప్పటి నుంచి ధాన్యం సేకరణ, తరలింపు నుంచి మిల్లర్‌ వద్దకు ధాన్యం చేర్చి రశీదు తీసుకునే వరకు గ్రామ వాలంటీర్లకే బాద్యత ఇస్తారు. సేకరించిన ధాన్యాన్ని తరలించే వాహనానికి రూట్‌ ఆఫీసర్లుగా కూడా వాలంటీర్లే వ్యవహరిస్తారు. ధాన్యం సేకరణ చేపట్టే వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.1500 పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయించారు. 

Also Read: ఏపీలో గ్రామ వాలంటీర్లకు మరో రూ. 1500 - కానీ ఆ పని చేస్తేనే !