Andhra grama volunteers :  ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వం మరో కీలక  బాధ్యతను అప్పగిస్తోంది.  ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ బాధ్యత మొత్తం వారికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రైతు పండించిన ధాన్యం కళ్లాల్లో ఉన్నప్పటి నుంచి ధాన్యం సేకరణ, తరలింపు నుంచి మిల్లర్‌ వద్దకు ధాన్యం చేర్చి రశీదు తీసుకునే వరకు గ్రామ వాలంటీర్లకే బాద్యత ఇస్తారు. సేకరించిన ధాన్యాన్ని తరలించే వాహనానికి రూట్‌ ఆఫీసర్లుగా కూడా వాలంటీర్లే వ్యవహరిస్తారు. ధాన్యం సేకరణ చేపట్టే వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.1500 పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయించారు. 


ఆరు నెలల పాటు ధాన్యం సేకరణ విధులు !


ఈ ఏడాది ఖరీఫ్‌లో  37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేయనున్నారు.  ఆరు నెలల పాటు సేకరణ జరుగుతుంది.  మార్చి వరకూ పలు రకాలుగా లక్ష్యాన్ని నిర్దేశించారు.  సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన రైస్ మిల్లుకే తరలించాల్సి ఉంటుంది.   ధాన్యం సేకరణ చేయాలంటే భూయజమానులు తప్పనిసరిగా ఇ క్రాప్‌, వెబ్‌ల్యాండ్‌లో తమ భూమి సర్వే నెంబర్‌ నమోదు చేసుకుని ఉండాలి. క్షేత్రస్ధాయి వెరిఫికేషన్‌ సంబంధిత అధికారులు చేయాల్సి ఉంటుంది.  ధాన్యంలో తేమశాతం, క్వాలిటీ తనిఖీ కోసం సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటారు. పిపిసి కూపన్లు రైతు భరోసా కేందాల్లో జనరేట్‌ చేస్తారు. 


ప్రతీ దశలోనూ వాలంటీర్‌దే కీలక  పాత్ర !


సేకరించిన ధాన్యాన్ని ఫ్యాక్‌ చేసేందుకు గన్నీ బ్యాగులు, రవాణా, రూట్‌ ఆఫీసర్లు కేటాయిస్తారు. సాంకేతిక నిపుణులు నాణ్యతను పరీక్షించిన అనంతరం ధాన్యం ఫోటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ధాన్యం సేకరణకు వెళ్లే రవాణా వాహనం నెంబరు, వేబ్రిడ్జిల బరువును రూట్‌ ఆఫీసర్ల సమక్షంలో సరిచూస్తారు. అనంతరం బిల్లును జనరేట్‌ చేస్తారు. గన్నీ బ్యాగుల్లో ధాన్యం నింపడం, ప్యాకింగ్‌ చేయడం, మిల్లుకు రవాణా, ట్రక్కు, బరువును అధికారి ధ్రువీకరించిన అనంతరం వరి ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయడానికి అనుమతిస్తారు. ధాన్యం మిల్లర్‌కు  అప్పజెప్పిన అనంతరం రైతుకు రశీదు ఇస్తారు.
 
వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం !


రైతు వద్ద ధాన్యం సేకరించేటప్పుడు క్వాలిటీని పరిశీలించడంతోపాటు ధాన్యాన్ని తూకం వేయడం, రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడటంపై వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి పలు కేటగిరీల ఉద్యోగులకు  శిక్షణను ఇచ్చారు. నవంబరు మొదటి వారంలో శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లో మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 3,423 రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి రూట్‌ అసిస్టెంట్లు 4,117 మంది, సబ్‌స్టిట్యూట్‌ సిబ్బంది 3,423మంది, కస్టోడియన్‌ ఆఫీసర్లు 3,078 మందికి మాస్టర్‌ ట్రైనీస్‌ శిక్షణ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


అన్ని రకాల విధుల్లో కీలకం అవుతున్న వాలంటీర్లు !


ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలు ... గవర్నమెంట్ వ్యవహారాలు మొత్తంలో వాలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. ఇప్పుడు ధాన్యం సేకరణ బాధ్యతలు కూడా వారికే ఇవ్వడంతో వారి ప్రాధాన్యం మరింత పెరిగినట్లయింది.