Andhra Agriculture News: ఈ మధ్యకాలంలో డ్రోన్ల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. సర్వేలకు, పంట నష్టాల పరిశీలనకు, ఇతర అవసరాలకు డ్రోన్ల వాడకం పెరిగిపోయింది. వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ఇతర అవసరాలకు రైతులకు డ్రోన్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో డ్రోన్ల వాడకం అనివార్యంగా మారింది. అయితే ఈ డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారి అవసరం కూడా పెరుగుతోంది. ఇలా కొత్త కొలువులు సృష్టి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ ప్రభుత్వం ఈ కొత్త కొలువులను గ్రామీణ యువతకు అందివ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తోంది. 


12 రోజుల పాటు అందించే సర్టిఫికేట్ కోర్సు


రాష్ట్రంలో ఒక్క వ్యవసాయ అవసరానికే 20 వేల మంది డ్రోన్ పైలట్లు అవసరం అవుతారని అంచనా. ఇతర అవసరాల కోసం కూడా పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 80 వేల మంది డ్రోన్ పైలట్లు కావాల్సిందే. ఈ నేపథ్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చి వారిని ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దాలని జగన్ సర్కారు సంకల్పించింది. ఈ శిక్షణను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 12 రోజుల పాటు అందించే సర్టిఫికేట్ కోర్సును రూపొందించింది. 


ఇప్పటికే 8 బ్యాచ్ లలో 135 మంది రైతులకు శిక్షణ


వ్యవసాయ కూలీల కొరతకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో 10 వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో అంటే జులైలోగా 500 ఆర్బీకేల పరిధిలో, డిసెంబర్ నాటికి మరో 1500 ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్లు అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది. డ్రోన్ల ఆపరేటింగ్ కోసం సీహెచ్సీ గ్రూపు చదువుకున్న రైతులకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రం సెంటర్ ఫర్ అప్సరా ద్వారా సంప్రదాయ వ్యవసాయ డ్రోన్ల రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజుల శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 8 బ్యాచ్ లలో 135 మంది రైతులకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మిలిగిన వారికి జులై కల్లా శిక్షణ పూర్తి చేస్తారు. ఇప్పుడు యువతకూ ఈ శిక్షణ ఇవ్వనున్నారు.


వ్యవసాయ డిప్లొమా, లేదా ఏదైనా ఇంజినీరింగ్ పట్టభద్రులైన యువతకు ఈ శిక్షణ ఇస్తారు. కనీసం మూడేళ్ల పాటు ఆర్బీకేల్లో పని చేసేందుకు ముందుకు వచ్చే వారికే డ్రోన్ పైలట్ శిక్షణ ఉచితంగా ఇస్తారు. ఇతర రంగాల్లో డ్రోన్లపై శిక్షణ పొందాలంటే ఫీజులు చెల్లించాలి. జులై నుండి దశల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తగా అప్సరా కేంద్రంతో పాటు తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మాస్టర్ ట్రైనీలు నియమించనున్నారు. ఇప్పటికే 10 మంది శాస్త్రవేత్తలతో పాటు విశ్వవిద్యాలయంలో వ్యవసాయ డిప్లొమా చదువుతున్న 125 మందికీ అప్సరా ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.