Zoonotic Langya virus:   ప్రపంచాన్ని మేడిన్ చైనా వైరస్‌లు వదలడం లేదు. ఇప్పటికీ కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆఫ్రికా నుంచి మంకీపాక్స్ అంతటా విస్తరిస్తోంది. తాజాగా..  చైనాలో ‘లాంగ్యా హెనిపా’ అనే కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకటించింది.  ఇప్పటికే ఈ వైరస్‌ను చైనాలోని షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో గుర్తించారు.  జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


చైనా లో వెలుగు చూసిన   జునోటిక్ ‘లాంగ్యా హెనిపా’  వైరస్‌


 జునోటిక్ ‘ లాంగ్యా హెనిపా ’  వైరస్‌ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తైనా, తైవాన్ శాస్త్రవేత్తలుచెబుతున్నారు.  దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయని, అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెంపుడు జంతువులపై నిర్వహించిన సెరోలాజికల్‌ సర్వేలో మేకలు, కుక్కల రక్త నమూనాలను అధికారులు సేకరించి, పరీక్షించారు. దీంతో మేకల్లో 2 శాతం, కుక్కల్లో 5 శాతం వరకు వైరస్‌ పాజిటివ్ తేలింది. 27శాతం ఎలుకల్లో వైరస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.


ఒకరి నుంచి మరొకరికి సోకుతుందనే ఆధారాలు లేవంటున్న చైనా, తైవాన్


తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించగా వెలుగులోకి వచ్చింది.  అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారికి పరీక్షలు నిర్వహించగా 35 మందిలో లాంగ్యా హెనిపా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. అయితే, బాధితులు ఒకరికొకరికి సన్నహిత సంబంధాలు లేవని, వైరస్‌ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. 


వైరస్ సోకితే తీవ్ర లక్షణాలు


జునోటిక్ ‘లాంగ్యా హెనిపా’  వైరస్ సోకితే లక్షణాలు ఎలా ఉంటాయో వైద్యులు ప్రకటించారు. వైరస్‌ సోకిన 26మందిలో రోగులు జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోవడంతో పాటు లివర్‌, కిడ్నీలపై వైఫల్యం చెందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ వైరస్‌పై ప్రపంచదేశాలు అలర్ట్ అవుతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 


 ఇంకా వెల్లువెత్తుతున్న కరోనా వేరియంట్లు 


దేశంలో కరోనా కేసులు నిలకడగా ఉంటున్నాయి. ప్రపంచం మొత్తం అదే పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్నాయి. తొలుత ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వేరియంట్ ఇప్పుడు కనిపించడం లేదు. కానీ దానికి అనుబంధంగా వచ్చిన వేరియంట్లు మాత్రం దడ పుట్టిస్తూనే ఉన్నాయి. చాలా వరకూ టీకాల ద్వారా వాటిని కట్టడి చేసినా కొత్త వేరియంట్లు భయం పుట్టిస్తూనే ఉన్నాయి.  కరోనాకు సంబంధం లేకుండా వస్తున్న మంకీపాక్స్ లాంటి  వైరస్‌లు కొత్తగా దడ పుట్టిస్తున్నాయి. ఈ వైరస్‌ల నుంచి ప్రపంచానికి మోక్షం కలిగే సూచనలు కనిపించడం లేదు.