మన శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, శరీరం ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేసేవి కిడ్నీలు. ఇవి రోజుకు దాదాపు 2 వందల లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వాటి పనితీరు ఆధారంగా మిగతా శరీర భాగాలు సమతుల్యం చెంది సమర్థవంతంగా పనిచేసి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ప్రస్తుతకాలంలో అత్యాధునిక వైద్యపద్ధతులు ఎన్ని వచ్చినా ఆందోళన కలిగించే అసంకామ్యత దీర్ఘకాల వ్యాధుల జాబితాలో కిడ్నీ సమస్య ఒకటి ప్రపంచవ్యాప్తంగా వేధిస్తోంది. కిడ్నీ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నా.. ప్రధానంగా జీవన విధానంలో మార్పులు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, హై బీపీ, షుగర్, గాలి, నీటి కాలుష్యం ప్రధానమైనవి. అదేవిధంగా శరీరంలో వేరే అవయవాల పనితీరు దెబ్బతిన్నప్పుడు కూడా ఆ ప్రభావం కిడ్నీ మీద పడి కిడ్నీ వైఫల్యానికి కూడా దారితీస్తుంది.
దేశంలో ఏటా రెండు లక్షలమంది కొత్తగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నట్లు అంచనా. మన దేశంలో 10 కోట్ల మంది కిడ్నీ బాధితులున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 850 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ఏటా దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో 2.4 మిలియన్ల మంది చనిపోతున్నట్టు అంచనా. ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ వ్యాధిగ్రస్థులుగా ఉన్నారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు (క్రానిక్ కిడ్నీ డిసీస్) వేధిస్తున్న నేపథ్యంలో 2040 నాటికి ప్రపంచ మరణాలలో 5వ స్థానాన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులే ఆక్రమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
అధిక ఆదాయ దేశాల్లో ఏటా డయాలిస్ మరియు కిడ్నీ మార్పిడికై వారి ఆరోగ్య బడ్జెట్లో 2-3 శాతం వినియోగించగా, మొత్తం ఆ దేశాల జనాభా పెడుతున్న ఖర్చు 0.03 శాతంకన్నా తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో మధ్యస్థ మరియు తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో కిడ్నీ వైఫల్యానికి గురైనపుడు డయాలసిస్ మరియు కిడ్నీ మార్పిడి అవకాశాలు సరైన రీతిలో అందుబాటులో లేక ప్రాణ రక్షణ కరువై మరణానికి దగ్గరవుతున్నారనేది భయాందోళన కలిగించే విషయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం వంటి కొన్ని ప్రాంతాల్లో కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇటీవల సైలెంట్ కిల్లర్ గా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతున్నందు వల్ల అంతర్జాతీయంగా వైద్య విభాగం అప్రమత్తమై “అందరికీ కిడ్నీహెల్త్” పేరిట ప్రజల్లో అవగాహనకు నడుం బిగించింది. పలు నెఫ్రాలజీ సొసైటీలు “వరల్డ్ కిడ్నీ డే’’ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి రెండో గురువారం వరల్డ్ కిడ్నీ డే గా నిర్వహిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు
ప్రపంచవ్యాప్తంగా 11 శాతం, మన దేశంలో 16 శాతం ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కిడ్నీ వైఫల్యం నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి, రెండు దశల్లో ఉన్నప్పుడు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తే తప్ప లక్షణాలు కనిపించవు. డయాబెటిస్, రక్తపోటు, అధిక బరువు, గతంలో కిడ్నీలో రాళ్లు వున్నవారు, వారసత్వంగా సమస్య వున్నవారు ముందస్తు పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని గుర్తించవచ్చు. మూడో దశలో కాళ్లు వాపు, రక్తహీనత, రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువమంది ఈ దశ వచ్చేవరకు సమస్యను గుర్తించలేరు. ఈ దశలో నిర్లక్ష్యం చేసినా, గుర్తించకపోయినా నాలుగో దశలో పరిస్థితి తీవ్రమై కిడ్నీ పనితీరు ఆగిపోయి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి గా మారుతుంది. ఆకలి మందగించడం, ఆయాసం, వాంతులు, ఒంట్లో నీరు చేరడం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశలో డయాలసిస్ చేయాలి లేదా కిడ్నీ మార్చాలి, లేదంటే సమస్య తీవ్రమై రోగి మరణించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల లక్షణాలను తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది.
వ్యాధి నిర్ధారణ
కిడ్నీ వ్యాధి నిర్ధారణ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. మూత్ర పరీక్ష, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ (జిఎఫ్ఆర్), రక్త పరీక్ష (సీరం క్రియాటినిన్) ద్వారా కిడ్నీ వ్యాధిని గుర్తించవచ్చు. కిడ్నీ వ్యాధుల్లోనూ పలు రకాలు ఉన్నాయి. అన్ని కిడ్నీ వ్యాధులకు డయాలసిస్ అవసరం ఉండదు. రోగులు కూడా ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే, ఆహార మార్పులు, మందులు, జీవనశైలి మార్పులతో వ్యాధిని నివారించవచ్చు. వ్యాధి తీవ్రమైతే డయాలసిస్ అవసరం రావచ్చు. ఈ వ్యాధి జీవక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున నెఫ్రాలజిస్ట్ సూచనల ప్రకారం ఆహార అలవాట్లను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచ కిడ్నీ దినోత్సవం రోజున, కిడ్నీ వ్యాధి రాకుండా, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు, వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు తలో చేయి కలుపుదాం.
- డా.అర్చనా దఫ్తార్దార్
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
రెనోవా హాస్పిటల్స్, కొంపల్లి