కరోనా ప్రపంచాన్ని ఎంతగా కలవరపెట్టిందో తెలిసిందే. అప్పటి నుంచి ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏదైనా ఉందీ అంటే అది ఆరోగ్యం మాత్రమే. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని అందించే ఆహారం, నిద్ర, వ్యాయామం వంటి అన్నింటి మీద శ్రద్ధ చూపుతున్నారు. ఇంటికి పరిమతమవటం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం, శానీటైజర్లు వాడడం, టీకాలు వేయించుకోవడం, పుష్టికరమైన, సమతుల ఆహారం, వ్యాయమం వంటి వాటన్నిటి ప్రాధాన్యత ఒకే ఒక్క మహామ్మారి పూర్తి మానవ జాతికే గుర్తుచేసింది. ఈ అవగాహన కలిగించడానికి అందరికంటే ముందు స్పందించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పవచ్చు. పాండమిక్ మొదలైన తర్వాత ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్బం మరింత సందర్భోచితం అయ్యింది.
ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ మానవ ఆరోగ్యం ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే దిశగా ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతారు. ఈదే రోజున 1948 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకు 75వ ఆవిర్భావ దినోత్సవం కూడా. ప్రతి ఏడాది ఏదో ఒక ఆరోగ్య సమస్య గురించి అవగాహన కలిగిస్తూ 75 సంవత్సరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో పూర్తి ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తూవస్తోంది. కోవిడ్ సమయాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తతతో ప్రపంచ దేశాలకు మార్గదర్శనం మనందరికి తెలిసిందే.
1945లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకటి ఉండాలనే ప్రతిపాదన బ్రెజిల్, చైనా కలిసి ఐక్యరాజ్య సమితి ముందుంచారు. దీని మీద ఏ ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని ప్రతిపాదనలో సూచించారు. 1946లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రత్యేక రాజ్యాంగాన్ని ఆమోదించారు.
1948లో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అవగాహన కల్పించే దిశగా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావం జరిగింది. మొదటి సమావేశంలో మొత్తం 61 దేశాలు పాల్గొన్నాయి. అవసరమైన వారికి సేవలు అందించడం, ప్రపంచదేశాల్లోని ప్రజలందరికీ ఆరోగ్యసంరక్షణా సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం ఈ సంస్థ ప్రాథమిక లక్ష్యం. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్ల పరిష్కారానికి కావల్సిన చర్యలను గురించి అవగాహన కలిగించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉద్దేశ్యం కూడా.
ఈ ఏడాది థీమ్
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ ప్రకారం ఈ ఏడాదంతా పనిచెయ్యాలని ఈ రోజున నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది అందరికి ఆరోగ్యం #HealthForAll అనే థీమ్ నిర్ణయించారు. అన్నివయసుల వారికి, సమాజంలోని అన్ని వర్గాల వారికి ఆరోగ్యం అందే దిశగా పనిచెయ్యాలని నిర్ణయించారు.
ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యవంతమైన శాంతియుత, సుసంపన్న, సుస్థిర వాతావరణంలో సంతోషకర జీవితాలను గడపాలి
మనుషులందరికీ ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా లభించాలి. ఆర్థిక భారం కాకుండా అవసరమైనపుడు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి. అనేవి లక్ష్యాలు కాగా ప్రపంచంలో దాదాపు 30 శాతం జనాభాకు ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేవు.
దాదాపు రెండు వందల కోట్ల మంది ఆరోగ్య పరిరక్షణా భారం భరించలేని విధంగా ఉంది. వారందరికీ ఆరోగ్యం అందుబాటులో లేదు. అత్యంత వెనుకబడిన పరిస్థితులు వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నమ్మకం.
అందరికీ ఆరోగ్యం అనే మాటను నిజం చెయ్యడానికి ఇది అవసరం. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే నైపుణ్యం కలిగిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్య నిపుణులతో పాటు ఆరోగ్యాన్ని అందించేందుకు పెట్టుబడి పెట్టగలిగే విధాన రూపకర్తలు కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజి అవసరం.
Also Read: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు