Causes of Diabetes : ఒకప్పుడు వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యల్లో మధుమేహం (Diabetes) ఒకటిగా ఉండేది. మారుతున్న కాలంతో పాటు.. వయసుతో సంబంధం లేకుండా షుగర్​ వచ్చేస్తుంది. రక్తంలో ఉండాల్సిన చక్కెర స్థాయిలకంటే ఎక్కువ ఉంటే షుగర్ కన్ఫార్మ్ అవుతుంది. మీ శరీరం తగినంత ఇన్సులిన్​ను ఉత్పత్తి చేయలేనప్పుడు.. లేదా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్​ను సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు షుగర్ వస్తుంది. 


మధుమేహం అనేది దీర్ఘకాలిక రుగ్మతగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలను పెంచడంతో పాటు ఇతర శరీరభాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇంత ప్రమాదకరమైన వ్యాధి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 14వ తేదీన వరల్డ్ డయాబెటిక్ డే నిర్వహిస్తున్నారు. దీనిపై సరైన అవగాహన లేక చాలా ఇబ్బంది పడటంతో పాటు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు మధుమేహంలో ఎన్ని రకాలుంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


మధుమేహంలో అనేక రకాలు ఉంటాయి. అయితే వీటిలో టైప్​1, టైప్ 2 సర్వసాధారణమైనవి. టైప్​ 1 మధుమేహం బాల్యం నుంచే వస్తుంది. టైప్​ 2 ఊబకాయం, జీవనశైలిలో మార్పులు, వయసు ప్రభావం వల్ల వస్తుంది. మీరు ఏ రకమైన డయాబెటిస్​తో ఇబ్బంది పడుతున్నా.. మీ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలి. దానిపై నియంత్రణ లేకుండా వదిలేస్తే.. గుండె జబ్బులు, నరాలు దెబ్బతినడం, కంటి సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మధుమేహం రావడానికి ప్రభావితం చేసే కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


టైప్ 1


ఈ రకమైన డయాబెటిస్​లో రోగనిరోధక వ్యవస్థ.. ఇన్సులిన్​ ఉత్పత్తి చేసే కణాలపై దాడిచేసి నాశనం చేస్తాయి. దీనివల్ల చిన్న వయసులోనే మధుమేహం బారిన పడతారు. జన్యు, పర్యావరణ కారకాల వల్ల కూడా ఇది వచ్చే అవకాశముంది. 


టైప్ 2 


శరీరంలోని కణాలు ఇన్సులిన్​కు తక్కువగా ప్రతిస్పందించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కుటుంబ చరిత్ర టైప్​ 2 డయాబెటిస్​ను బాగా ప్రభావితం చేస్తుంది. జీవనశైలిలో మార్పులు కూడా దీనిని ప్రేరేపిస్తాయి. 


ప్రెగెన్సీ మధుమేహం..


మహిళల్లో చాలా మందికి ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం వస్తుంది. హార్మోన్లలో జరిగే మార్పుల వల్ల ఇది వచ్చే అవకాశముంది. హార్మోన్లలో కలిగే మార్పులు ఇన్సులిన్​కు ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల మధుమేహం వస్తుంది. మరికొందరిలో శరీరంలో జరిగే పెరిగిన ఇన్సులిన్​ స్థాయిలకు అనుగుణంగా ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కూడా వస్తుంది. 


ఊబకాయం, అధికబరువు, శారీరక శ్రమ లేకపోవడం, ప్రాసెస్​ చేసిన ఆహారాలు తీసుకోవడం, కూల్ డ్రింక్స్, ఫైబర్​ తీసుకోకపోవడం, అన్​ హెల్తీ ఫ్యాట్​ తీసుకోవడం వంటివి కూడా మధుమేహం రావడానికి కారణమవుతాయి. 


మధుమేహాన్ని కంట్రోల్ చేయాలంటే అన్నింటికన్నా ముందు ఫుడ్ కంట్రోల్ చేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. శరీరంలో షుగర్ పెరిగిందో లేదో.. తెలుసుకుని జాగ్రత్తగా ఉండేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. హెల్తీ ఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ, వైద్యులు సూచించిన మందులు, ఇంజెక్షన్లు సమయానికి తీసుకోవడం కచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడంతో పాటు.. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


Also Read : కిడ్నీలో రాళ్ల వల్ల నొప్పా? ఈ సింపుల్ యోగాసనాలతో తగ్గించుకోండి