ఓ మహిళకు భుజం నొప్పి తీవ్రంగా వచ్చింది. కాసేపు నిద్రపోతే ఆ నొప్పి తగ్గుతుందని పడుకుంది. కానీ ఆమె ఎన్ని గంటలు గడిచినా లేవకపోవడంతో, భర్త ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ఎంతకీ లేవలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మరణించినట్టు చెప్పారు వైద్యులు. కేవలం భుజం నొప్పి కారణంగా మరణం సంభవిస్తుందా? అని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించిందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వైద్యులు ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించలేదని, పల్మోనరీ ఎంబోలిజం వల్ల చనిపోయిందని వివరించారు. ఇలా భుజం, కాలు లాంటివి తీవ్రంగా నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం చాలా ఉత్తమమని సూచించారు. 


పల్మనరీ ఎంబోలిజం అంటే...
ఈ సమస్య ఉన్నవారిలో రక్తం గడ్డ కడుతుంది. అలా రక్తం గడ్డ కట్టడం ఏ ప్రాంతంలోనైనా జరగొచ్చు. అంటే చేతిలో, కాలిలో ఇలా ఏ ప్రదేశంలో ఉన్న రక్తనాళంలోనైనా జరగొచ్చు. ఇలా జరగడం వల్ల ఊపిరితిత్తుల్లోని ధమనిలో కూడా రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. అలాంటప్పుడు పల్మనరీ ఎంబోలిజం ఏర్పడుతుంది. 


దీనికి కారణాలు ఏమిటి?
పల్మొనరీ ఎంబోలిజం రావడానికి ముఖ్య కారణం ‘డీప్ వెయిన్ థ్రాంబోసిస్’. ఇది కాళ్లలో వచ్చే సమస్య. కాళ్లలోని రక్తం గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఈ గడ్డల వల్ల నరాలు తెగిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఈ గడ్డలు ఊపిరితిత్తుల వైపు వెళ్లి అక్కడ ధమనుల్లో అడ్డంకిగా ఉంటుంది. దీనివల్ల గుండె విఫలమవుతుంది. ఇదే పల్మోనరీ ఎంబోలిజం. 


లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. ఛాతీ నొప్పి తీవ్రంగా వస్తుంది. నొప్పి అకస్మాత్తుగా మొదలై క్రమంగా పెరుగుతుంది. 
2. దగ్గుతున్నప్పుడు రక్తం కనిపించవచ్చు.
3.  మూర్చ వచ్చినట్లు అనిపిస్తుంది. 
4. తల తిరిగినట్టు అవుతుంది.
5. శ్వాస సరిగా ఆడదు.
6. కాలిలో లేదా భుజంలో తీవ్రంగా నొప్పి వస్తుంది.
7.  జ్వరం వస్తుంది.
8.  గుండె కొట్టుకునే వేగం ఎక్కువ అవుతుంది. 


చికిత్స ఎలా?
రక్తం గడ్డ కట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్తం, ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. ఇది కొన్నిసార్లు కార్డియాక్ అరెస్టుకు కారణం అవుతుంది. పల్మనరీ ఎంబోలిజం వచ్చిన వారిలో జీవించే వారి శాతం 30 మాత్రమే. కాబట్టి ఏదైనా లక్షణం కనిపించగానే సత్వర చికిత్స తీసుకోవడం వల్ల మరణ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.  ఈ సమస్యను ఇమేజింగ్ పరీక్షలు, రక్త పరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. చికిత్సలో భాగంగా రక్తాన్ని పలుచన చేయడానికి మందులు ఇస్తారు. రక్తంలో కట్టిన గడ్డను కరిగించడానికి మందులు సూచిస్తారు. అవి కరిగే పరిస్థితి లేకపోతే ఆ గడ్డను తొలగించేందుకు శస్త్రచికిత్స చేస్తారు.   


Also read: ఆల్కహాల్ అలెర్జీ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ






























































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.