పండ్లు ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోజుకో ఆపిల్ తింటే.. డాక్టర్‌తో పనే ఉండదని అంటారు. మరి, ప్రత్యేకంగా శీతాకాలమే ఆపిల్ పండ్లు ఎక్కువ తినాలని చెప్పడం వెనుక ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందా? దీనిపై నిపుణులు ఏం చెప్పారో చూద్దాం. 


ఆపిల్స్ తినడం ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. ఆపిల్‌లో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. జ్యూసిగా, మధురంగా ఉండే ఆపిల్ పండ్లను ఇష్టపడినవారంటూ ఎవరూ ఉండరు. ఆపిల్‌లో ఎన్నో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తదితర పోషకాలు ఉంటాయి. ఈ పండు తినడం వల్ల  రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. US డిపార్టుమెంటు ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం.. ఒక మీడియం సైజ్ ఆపిల్ పండు 4.8గ్రాముల ఫైబర్, 0.5 గ్రాముల కొవ్వు, 0.6 గ్రాముల ప్రోటీన్, 100మిల్లీ గ్రాముల పొటాషియం, 11.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 6 మిల్లీ గ్రాముల విటమిన్-C ఉంటుంది. 


శీతాకాలంలోనే ఎందుకు తినాలి?


మరి, ఈ పండును శీతాకాలంలో ఎక్కువగా తినాలని ఎందుకంటారనేగా మీ సందేహం? ఎందుకంటే.. చలికాలం వచ్చిందంటే వ్యాధులు క్యూకడతాయి. మన పరిసరాల్లో ఉండే బోలెడన్ని బ్యాక్టీరియాలు, వైరస్‌లు మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఆపిల్ తిన్నట్లయితే.. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ యాక్టీవ్‌గా ఉంటుంది. వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మన శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి లేకపోతే.. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆపిల్‌ ఉండే యాంటిఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్.. శరీరంలోని కణాలను ఆక్సీకరణ, ఒత్తిడికి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి సహాయపడతాయి. శీతాకాలంలో ఆపిల్ పండ్లు తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు లభిస్తాయి. 


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది


శీతాకాలంలో వేయించిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటాం. అలాంటప్పుడు ఆపిల్ పండ్లను తింటే.. వాటిలో ఉండే 'పెక్టిన్' అనే పీచు పదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి  సహాయపడుతుంది. అలాగే మలబద్దకం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో అధిక మాలిక్ ఆమ్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది


శీతాకాలంలో చాలామంది వారికీ నచ్చిన ఆహారాన్ని తింటుంటారు. వ్యాయామం కూడా చేయపోవడం వల్ల కొవ్వు స్థాయిలు పెరిగిపోతాయి. ఆపిల్ పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ LDL తగ్గించి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. హెల్త్ లైన్ నివేదిక ప్రకారం.. రెండు నుంచి మూడు మీడియం సైజ్ ఆపిల్ పండ్లను తినడం వల్ల 5-13 శాతం వరకు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని అని పేర్కొన్నారు. మరి కొన్ని అధ్యయనాలు LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ 7% తగ్గినట్లు, HDL కొలెస్ట్రాల్ స్థాయిలు 12% పెరిగినట్లు చెబుతున్నాయి.


రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది


వేసవి కాలంతో పోల్చుకుంటే  శీతాకాలంలో మధుమేహ సమస్య ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో రోజుకో ఆపిల్ తింటే అది ఇన్సులిన్ నిరోదకతను తగ్గించి.. రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఆపిల్ లోని పాలీఫెనల్.. క్లోమంను ఉత్తేజపరిచి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడానికి తోడ్పడుతుంది.


గుండె పోటు ప్రమాదం నుంచి కాపాడుతుంది 


శీతాకాలంలో చల్లగా ఉండటం వల్ల రక్త కణాలు సంకోచించి రక్త పోటు, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆపిల్ పండ్లలో ఉండే సోలుబల్ ఫైబర్.. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. ఈ ప్రమాదం నుంచి  కాపాడుతుంది. 


బరువు తగ్గడంలో సహాయపడుతుంది


వాతావరణం చల్లగా ఉండటం వల్ల మనకు వేడి వేడి గా ఏదైనా తినాలనిపించి రకరకాల పదార్థాలను తింటూ ఉంటాం. అప్పుడు కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకునే అవకాశం ఉంటుంది. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు.. దానికి తగినట్లుగా శారీరక శ్రమ కూడా చేయాలి. లేకపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రోజుకో ఆపిల్ తింటే దానిలోని ఫైబర్ కడుపు నిండుగా ఉందనే భావన కలిగిస్తుంది. పైగా ఆపిల్స్ కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బరువు పెరుగుతానే భయం కూడా అక్కర్లేదు. 


Also Read: గ్లిజరిన్‌తో చక్కని అందం - కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి