పాదాల అడుగున వెనుక భాగంలో చర్మం గరుకుగా మారి తర్వాత పగుళ్లుగా ఏర్పడుతుంది. ఇది చూడడానికి అందవికారంగా కనిపించడమే కాదు కొన్నిసార్లు మంట, నొప్పితో బాధిస్తుంది కూడా. ఆ పగుళ్ళ బారిన పడే వారిలో మగవారితో పోలిస్తే ఆడవారే ఎక్కువ. ఇంటి పనుల్లో పడి పాదాలను పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఆ పగుళ్లు తీవ్రంగా మారి మరింతగా బాధిస్తాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక ఎంతో మంది మహిళలు అలా వదిలేస్తారు. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో పగుళ్లు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే వచ్చిన పగుళ్లను మళ్లీ మృదువుగా మార్చుకోవచ్చు.
ఎందుకు వస్తాయి?
ముందుగా పాదాలకు పగుళ్లు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి? మన మొత్తం శరీరం నిల్చోవడానికి, నడవడానికి సహకరించేవి పాదాలే. అంటే మన శరీర భారాన్ని మొత్తం అవే మోస్తాయి. దీనివల్ల అవి ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అందుకే మన శరీర నిర్మాణంలో పాదాల కింద చర్మం చాలా మందంగా ఉంటుంది. దృఢమైన కండరపొరతో విస్తరించి ఉంటుంది. శరీర రక్తప్రసరణ వ్యవస్థలో అడుగున ఉండేవి పాదాలే. అందుకే అక్కడి వరకు రక్తం చేరడం ఒక్కోసారి తగ్గిపోతుంది. నీటిని, పోషక విలువలని తీసుకెళ్లేవి రక్తనాళాలే. రక్తం ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి పోషకాలు, ఆక్సిజన్, నీరు వంటివి చేరుతాయి. కానీ పాదాల అడుగు భాగానికి మాత్రం సరిగా చేరక అక్కడ ఎండిపోతుంది, దీనివల్ల చర్మం పగుళ్లు ఏర్పడుతుంది. ఒక్కసారి నీరు లేని పంట పొలాలను గుర్తు తెచ్చుకోండి. బీరు వారినట్లు అవుతాయి. పాదాల అడుగుభాగం కూడా అంతే. ఇలా జరగకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
ఏం చేయాలి?
1. పాదాల పగుళ్ళతో బాధపడుతున్న వారు రోజూ నిద్రపోయే ముందు కొబ్బరి నూనె పాదాల పగుళ్ల భాగంలో బాగా పట్టించాలి. బాగా మర్ధనా చేయాలి.
2. రోజులో పావుగంటసేపు పాదాలను చల్లని నీరు నింపిన బకెట్లో ముంచి ఉంచాలి. తరువాత పగుళ్ల భాగంలో బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు పోతాయి.
3. పైనాపిల్ పండును మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జును పాదాల పగుళ్ళపై రాసి 45 నిమిషాల పాటు వదిలేయాలి. పైనాపిల్ లో ఉండే ఆమ్ల గుణాలు పగుళ్లలో పేరుకుపోయిన మృత కణాలను తొలగిపోయేలా చేస్తాయి. పగుళ్లు కూడా తగ్గుతాయి. చర్మం గరుకుగా కాకుండా మృదువుగా మారతాయి.
4. పాదాలకు రోజు మర్దన చేసుకుంటే రక్తప్రసరణ సవ్యంగా అవుతుంది. దీనివల్ల అక్కడ చర్మం పోషకాహారంతో నిండి పగుళ్లు రాకుండా ఉంటుంది. రోజులో కనీసం పావుగంటసేపు మర్దన చేసుకోవడం అవసరం.
Also read: ఆపిల్ పండ్లు తింటే ఎంతో ఆరోగ్యం, కానీ ఆ సమయంలో మాత్రం తినకూడదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.