ఆపిల్ పండు నిండ పోషకాలు మెండుగా ఉంటాయి. దీనిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. అందుకే రోజుకో ఆపిల్ పండు తింటే చాలు, వైద్యుడి అవసరం ఉండదు అంటూ పెద్దలు చెబుతుంటారు. అది నిజమే. ఆపిల్ పండ్లు తినడం వల్ల మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ పండును సంపూర్ణ పోషణను ఇచ్చే ఆహారంగా చెప్పవచ్చు. అయితే ఈ పండు తినకూడని సమయం కూడా ఉంది. రోజులో ఎప్పుడైనా ఆపిల్ పండును తినవచ్చు కానీ రాత్రి పూట మాత్రం వద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. దానికి కారణం ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును రాత్రిపూట తింటే త్వరగా జీర్ణం కాదు, దీనివల్ల అజీర్తి వంటి సమస్యలు మొదలవుతాయి. జీర్ణ వ్యవస్థ విధులకు ఆటంకం కలుగుతుంది. యాపిల్ పండుతో పాటు రాత్రిపూట ఇతర ఆహారాలు కూడా సరిగా జీర్ణం కావు. దీంతో గ్యాస్, మలబద్ధకం వంటికి వచ్చేస్తాయి. కాబట్టి రాత్రి పూట ఆపిల్ పండు తినే అలవాటును వదిలేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఈ పండును తినవచ్చు. ఆపిల్ పండు రాత్రిపూట తినడం వల్ల కలిగే చిన్న ఇబ్బంది అదే, కానీ కొందరిలో ఆ చిన్న ఇబ్బంది, పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే పోషకాహార నిపుణులు రాత్రిపూట యాపిల్ తినడం మానేయమని సూచిస్తున్నారు.


అదే ఉదయం పూట ఆపిల్ పండును తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. రాత్రిపూట జీర్ణ సమస్యలను పెంచే ఈ ఫైబర్, ఉదయం పూట ఆ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఎందుకంటే ఉదయం మనం ఇటు అటు కదులుతూ పనులు చేస్తాం. రాత్రి నిద్రపోతాం. అదే తేడా. ఉదయం పూట ఈ పండును తినడం వల్ల అసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు ఈ పండు ఒకటి తింటే చాలు, పొట్ట నిండిపోయిన భావన కలుగుతుంది. దీనివల్ల ఇతర ఆహారాలు తక్కువగా తింటారు. ఈ పండ్లను తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. దీనివల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ రోగులకు ఆపిల్ పండు చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు. అందుకే డయాబెటిక్ రోగులు రోజుకో ఆపిల్ పండును తినడం అలవాటు చేసుకోవాలి.


రక్తహీనతతో బాధపడే పిల్లలు, మహిళలు రోజుకో ఆపిల్ పండును కచ్చితంగా తినాలి. ఇది రక్తం ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా ఎనీమియా సమస్య నుంచి బయట పడవచ్చు. ఎనీమియా ఉంటే నీరసం, విపరీతమైన అలసట కలుగుతాయి. వాటన్నింటి నుంచి ఆపిల్ రక్షణ కల్పిస్తుంది. ఆపిల్ పండ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్లే హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తాయి. ఆపిల్ పండు తింటే రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 


Also read: మయోన్నెస్ రోజూ తింటున్నారా? ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.