‘యమ దొంగ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మమతా మోహన్ దాస్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఇటీవలే క్యాన్సర్, హాడ్కిన్స్ లింఫోమా నుంచి కోలుకున్న ఆమెను మరో సమస్య కూడా వెంటాడుతోంది. అదే ‘బొల్లి’. దీన్నే వైద్య పరిభాషలో విటిలిగో (Vitiligo) లేదా ఆటోఇమ్యూన్ డిసీజ్ అని కూడా అంటారు. మమతా తాజాగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. మమతాకు ఏర్పడిన ఈ సమస్య మీలో ఎవరికైనా రావచ్చు. కాబట్టి.. దాని గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే. 


‘బొల్లి’ వ్యాధి ఎందుకు ఏర్పడుతుంది? 


మమతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు వచ్చిన సమస్య గురించి వెల్లడించింది. తాను రంగును కోల్పోతున్నానని తెలిపింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లి అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్. దీని వల్ల చర్మం రంగు కోల్పోతుంది. అయితే, శరీరం మొత్తం రంగు మారదు. అక్కడక్కడ కలర్‌లో మార్పు కనిపిస్తుంది. పిగ్మెంట్లను తయారు చేసే చర్మ కణాలైన మెలనోసైట్లు దాడి చేయడం వల్ల చర్మం తెల్లరంగులో మారుతుంది.  


ఎలా గుర్తించాలి? లక్షణాలేమిటీ?


శరీర రోగనిరోధక వ్యవస్థ మెలనోసైట్‌లపై దాడి చేసి నాశనం చేయడం వల్లే బొల్లి ఏర్పడుతుంది. ఈ సమస్య రావడానికి ఇదే ప్రధాన కారణం. అయితే, ఇది వంశపారంపర్యంగా కూడా సోకుతుంది. మానసిక ఆందోళన, వడదెబ్బ, రసాయానలకు గురికావడం వంటి కారణాలు కూడా బొల్లికి కారణమవుతాయి. బొల్లి ఏర్పడినప్పుడు ఈ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. 
⦿ ఈ వ్యాధి సోకినవారిలో ముందుగా చేతులు లేదా మోకాళ్ల వంటి భాగాల్లో తెల్లని పాచెస్ కనిపిస్తాయి. 
⦿ కొందరిలో ఆ పాచెస్ మరింత పెద్దగా ఉంటాయి. ఒక్కోసారి పెద్దగా కూడా అవుతాయి. 
⦿ చర్మం తెల్లగా మారిన చోట వెంటుకలు కూడా తెల్లగా మారుతుంది. 
⦿ తల చర్మం, కనుబొమ్మలు, వెంట్రుకలు, గడ్డం, వెంట్రుకలు ఇలా శరీరంలో ఎక్కడైనా బొల్లి రావచ్చు. 
⦿ నోరు లేదా ముక్కు లోపలి భాగం వంటి శ్లేష్మ పొరల్లో కూడా బొల్లికి గురవుతాయి.  


చికిత్స సాధ్యమేనా?


బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యాధికి చికిత్స లేదు. అయితే, ఇది చర్మాన్ని మరింత ప్రభావితం చేయకుండా డిపిగ్మెంటేషన్‌ను నిరోధించాలి. డిపిగ్మెంటేషన్ నష్టాన్ని నివారించడానికి సూర్యరశ్మి ఎక్కువ తగలకుండా జాగ్రత్తపడాలి. నారో-బ్యాండ్ UVBతో ఫోటోథెరపీ ద్వారా బొల్లి వ్యాప్తిని నియంత్రించవచ్చు.కార్టికోస్టెరాయిడ్స్ లేదా కాల్సినూరిన్ ఇన్హిబిటర్లతో సైతం బొల్లిని అడ్డుకోవచ్చు. ప్సోరాలెన్, లైట్ థెరపీ ద్వారా కూడా బొల్లి మచ్చలను కంట్రోల్ చేయొచ్చు. అలాగే మారిన కలర్‌ను కూడా సాధారణ రంగులోకి మార్చుకోవచ్చు. పై వైద్య చికిత్స విధానాలేవీ సాధ్యం కాకపోతే శస్త్ర చికిత్స ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా కూడా మారిన మచ్చలను చర్మం సాధారణ రంగులోకి మార్చవచ్చు. 






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.