Peddireddy Vs Chandrababu: తిరుపతి : పీలేరు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలకు ఘాటుగా స్పందించారు ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాజీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చి పదేపదే తన గురించి మాట్లాడుతున్నారని, తాము ప్రజల కోసం పని చేస్తున్నామని, చంద్రబాబు లాగ సొంత మనుషుల కోసం కాదన్నారు. రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు జెండాను పీకేస్తాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు చోట్లా పోటికి నేను సై అన్నారు. ఏపీ సీఎం జగన్ అదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటికి తాను సిద్దంగా ఉన్నానని.. పుంగనూరులో నాపై పోటికి చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. 


మా పక్షాన ప్రజలు ఉన్నంత కాలం మా పని అయిపోదు అని, చంద్రబాబు కారు కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లాలో మాపై పై చెయ్యి సాధించడం చంద్రబాబు నీ బాబు తరం కుడా కాదు అన్నారు. చంద్రబాబు తన మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వైద్యులను కలిసి చూపిస్తే మంచిదన్నారు. కుప్పంలో నీ పరిస్థితి ఏంటో తాను తేల్చుకుంటానన్నారు.  చంద్రబాబు నువ్వు పుంగనూరులో చేసేది ఏముంది, మేం కుప్పంలో నీ జెండాను శాశ్వతంగా పీకేసే రోజులు దగ్గరలో ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.


రెండు చోట్లా పోటికి నేను సై..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎం జగన్ అదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. అయితే తన ఇలాకా పుంగనూరులో తనపై పోటికి సిద్ధమా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కుడా కష్టమేనని, ఇప్పటికే తన జెండా మోయమని పవన్ కళ్యాణ్ కు టిడిపి జెండా అప్పగించింది నువ్వు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.


చంద్రబాబు ఏమన్నారంటే.. 
మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి కూడా చంద్రబాబు మాట్లాడారు. ‘‘నా కార్యకర్తలను జైళ్లలో పెట్టారు పెద్దిరెడ్డీ.. పండగ పూట నా కార్యకర్తల కోసం జైలుకు వచ్చా. ఇక నీ పని అయిపోయింది. నీ పార్టీ పని కూడా అయిపోయింది పెద్దిరెడ్డీ. సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు’’ అని చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.


సీఎం జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను జైలులో పెట్టించాడని, పండగపూట వారిని కలిసి పరామర్శించేందుకు వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ శ్రేణులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారని, నీచాతి నీచంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. పోలీసుల తీరు ఉగ్రవాదులను తలపిస్తుందని అన్నారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నీ పని, నీ పార్టీ పని అయిపోయింది జగన్ రెడ్డీ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 


రొంపిచర్ల ఫ్లెక్సీల వివాదంలో టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. సోమవారం (జనవరి 16) మధ్యాహ్నం అన్నమయ్య జిల్లాకు వచ్చిన చంద్రబాబు సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ నేతలు కోడికత్తి డ్రామాలు ఆడొద్దని ఎద్దేవా చేశారు. ఏపీలో మైనార్టీలకు మనుగడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ పాటించాలి. కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు.