Monkeypox In UP : దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసు ఇంకా ఒక్కటి కూడా బయటపడలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే తొలిసారిగా యూపీలోని ఘజియాబాద్ నగరంలో ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్ (monkeypox) వైరస్ సోకిందని అనుమానంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.బాలికకు మంకీపాక్స్ సోకిందనే అనుమానంతో తాము పరీక్ష కోసం నమూనాలను సేకరించినట్లు ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శనివారం చెప్పారు. మంకీపాక్స్ సాధారణంగా ఫ్లూ లాంటి అనారోగ్యం, శోషరస కణుపుల వాపుతో ప్రారంభమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. తర్వాత ముఖం, శరీరంపై దద్దుర్లు వస్తాయని వైద్యులు చెప్పారు.బాలికకు ఇతర ఆరోగ్య సమస్యలు లేవని, బాలిక లేదా ఆమె సన్నిహితులు ఎవరూ విదేశాలకు వెళ్లలేదని ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రాలకు కేంద్రం జాగ్రత్తలు
మంకీపాక్స్‌కు సంబంధించి ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. గత 21 రోజుల్లో మంకీ పాక్స్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన అనుమానిత రోగులందరినీ నిశితంగా పరిశీలించాలని సూచించింది. అనుమానాస్పద రోగుల సమాచారాన్ని వెంటనే స్థానిక జిల్లా అధికారి నుండి ఆరోగ్య శాఖకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. స్థానిక, నాన్-ఎండెమిక్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయాలని సూచించింది. అటువంటి రోగులకు చికిత్స చేసేటప్పుడు అన్ని ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను అనుసరించాలని నిర్దేశించింది. నివేదిక సానుకూలంగా వస్తే, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించాలని సూచనల్లో పేర్కొంది.
ఈ జాగ్రత్లు తీసుకోవాలి
మంకీపాక్స్ సోకిన వ్యక్తికి దగ్గరగా మసలిన వారు 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలి. వ్యాధిగ్రస్తుడితో ఇంట్లో కానీ, వెలుపల కానీ సన్నిహితంగా ఉన్నవారు తాము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసిందీ సంబంధిత అధికారులకు తెలపాలి. ఈ వ్యక్తులు 21 రోజులపాటు బయట తిరగకూడదు. వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాలబాలికలకు సమీపంగా వెళ్లకూడదు.
దేశంలో ఇంత వరకూ ఒక్క మంకీపాక్స్ కేసు కూడా వెలుగుచూడలేదు. ఆఫ్రికాతో పాటు ఆమెరికాలోనూ కేసులు పెరుగుతున్నాయి.