టీ అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఎన్నో ఇళ్లల్లో అది ఇంటి సంప్రదాయంగా మారిపోయింది. ఉదయం లేచిన వెంటనే టీతోనే వారి రోజు మొదలవుతుంది. అలాగే సాయంత్రం టీ తాగాకే ఆ రోజు గడుస్తుంది. లేకపోతే రోజంతా అసంపూర్ణంగా ఉన్నట్టు  భావిస్తారు ఎంతోమంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వేడి పానీయాలు కాఫీ, టీలతో పాటూ కొందరికి స్నాక్స్ తినే అలవాటు ఉంది. అలా తింటూ టీ తాగుతుంటే అనుభవం అద్భుతంగా ఉంటుందని వారు ఫీల్ అవుతారు. అయితే టీ తాగేటప్పుడు తినే స్నాక్స్‌లో కొన్ని రకాలను దూరం పెట్టాలి. అవి మన శరీరానికి హాని కలిగిస్తాయి.


శెనగపిండితో చేసే స్నాక్స్
టీతోపాటు నమ్కీలు, భుజియా, పకోడీలు తినడానికి ఇష్టపడుతున్నారా? అవన్నీ శెనగపిండితో చేసేవి. శెనగపిండితో చేసే చిరుతిళ్లు, జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. పోషకాలను గ్రహించడంలో శరీర సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి టీ తాగేటప్పుడు వాటిని దూరంగా పెట్టాలి.


చల్లటి ఆహారం
టీ తాగుతూ చల్లటి ఆహారాలు తినకూడదు. ఈ కలయిక జీర్ణ వ్యవస్థను బలహీన పరుస్తుంది. వికారం కూడా కలిగిస్తుంది. టీ వంటి వేడి పానీయాలు తాగాక, అరగంట వరకు ఎలాంటి చల్లని ఆహారాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


పసుపు 
పసుపు పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా వాడాల్సిన పదార్థాలలో ఒకటి. అయితే టీ తాగుతున్నప్పుడు పసుపు కలిపిన ఏ పదార్థాలు తినకపోవడమే మంచిది. లేకుంటే పొట్టలో గ్యాస్, మలబద్ధకంవంటి సమస్యలు మొదలవుతాయి.


నిమ్మరసం 
లెమన్ టీ అధికంగా తాగడం మంచిది కాదు. ఇది అసిడిక్ రియాక్షన్ చూపిస్తుంది. నిమ్మకాయల్లో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీకు వికారం కలిగిస్తుంది. నిమ్మరసంతో చేసిన టీ తాగడం వల్ల ఆమ్ల స్వభావం అధికమై పొట్టలో వాపు ఎక్కువవుతుంది. అందుకే ఉదయాన లేచిన వెంటనే లెమన్ టీ తాగకూడదు. ఏదైనా ఆహారాన్ని తిన్నాక లెమన్ టీ తాగడం మంచిది.


ఐరన్ నిండిన ఆహారాలు
టీలో టానిన్లు, ఆక్సలైట్లు ఉంటాయి. ఇవి ఇరుమును శరీరం శోషించకుండా అడ్డుపడతాయి. కాబట్టి టీ తాగుతున్నప్పుడు నట్స్, ఆకుకూరలు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. 


టీ, కాఫీలు తాగడం వల్ల ఉత్సాహం వస్తుంది. కానీ అధికంగా తాగితే శరీరంలో కెఫీన్ అధికంగా చేరి ఇతర సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా నిద్రలేమి బాధిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల్లోపే టీ, కాఫీల్లాంటి పానీయాలు తాగాలి. సాయంత్రం తాగితే నిద్ర సరిగా పట్టే అవకాశం ఉండదు.


Also read: బంగాళదుంపలతో చేసే స్వీట్ హల్వా ఎప్పుడైనా తిన్నారా? ఓసారి ట్రై చేయండి
























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.