భయంకరమైన మానసిక రోగాల్లో ఒకటి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఒక మనిషిలోనే వివిధ రకాల వ్యక్తిత్వాలు బయటపడుతుంటాయి. అందులో కొన్ని ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైనవి కూడా. ఈ డిజార్డర్‌నే డిస్అసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అని కూడా అంటారు. వీరి వల్ల పక్క వాళ్లకి కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఈ వ్యాధి కథాంశంతోనే తెలుగులో ‘అపరిచితుడు’, ‘త్రీ’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ వ్యాధి ఉన్నవారిలో జ్ఞాపకశక్తి కోల్పోవడం,భ్రమలు కలగడం, విపరీతమైన డిప్రెషన్‌కు గురికావడం వంటివి కలుగుతాయి.ఈ వ్యాధి కలిగిన వారు కింద చెప్పిన లక్షణాలను చూపిస్తుంటారు. నిజానికి వీరిని గుర్తించడం కష్టమే. కొన్ని లక్షణాలు ద్వారా గుర్తించే వీలు ఉంటుంది.
1. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ప్రపంచం పట్ల భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. ప్రపంచం చాలా దిగజారిపోయిందని,క్షీణించిందని అంటుంటారు. వాస్తవికతకు దూరంగా బతుకుతుంటారు. వారి వ్యక్తిత్వం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది.
2. జ్ఞాపకశక్తిలో అంతరాలు కనిపిస్తుంటాయి.వ్యక్తిత్వాలు మారినప్పుడు ముందు జరిగిన సంఘటనలు మర్చిపోతుంటారు. ఏ వ్యక్తిత్వంలో వారు ఉంటారో అదే గుర్తుంచుకుని మిగతా వ్యక్తిత్వాల విషయాలు ఒక్కోసారి మర్చిపోతుంటారు. దీనివల్లే జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి.
3. మనస్సు గందరగోళంగా ఉంటుంది, మానసికంగా చాలా కుంగిపోయి ఉంటారు. చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలే వారిని చాలా ప్రభావితం చేస్తాయి. వారు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు.
4. బహుళ వ్యక్తిత్వాల వల్ల మనస్సులో బాధ పెట్టే, కలవరపెట్టే ఆలోచనలు అధికంగా కలుగుతాయి. ఆ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయంటే భవనం పైనుంచి దూకేయాలని, తనకు తాను హాని చేసుకోవాలని అనుకుంటారు. ఈ మానసిక రుగ్మత కలిగే డిప్రెషన్ వల్ల ఆత్మహత్యా ఆలోచనలు కూడా వస్తాయి.
5. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ రుగ్మతతో బాధపడుతున్నవారికి రకరకాల ఫోబియాలు మొదలవుతాయి. వ్యక్తులంటే భయం (ఆంత్రోఫోబియా), చీకటంటే భయం (నిక్టోఫోబియా), ఒంటరిగా ఉండాలనే భయం (ఆటోఫోబియా) వంటివి కలుగుతాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Also read: మద్యం నిజంగానే బాధల్ని మరిచిపోయేలా చేస్తుందా? శరీరంలో చేరాక ఆల్కహాల్ చేసే పనేంటి?
Also read: అన్నంలో కెలోరీలు తగ్గించాలా? వండేటప్పుడు ఇలా చేయండి, యాభైశాతం కెలోరీలు తగ్గిపోవడం ఖాయం
Also read: అమ్మాయిలూ వర్చువల్ డేటింగ్‌లో ఉన్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందుల్లో పడతారు