ఒక వ్యక్తి జీవితంలో అతను తీసుకునే ఆహారం, నిద్ర... ఈ రెండే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉందో, నిద్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే చాలామంది అతి తక్కువగా నిద్రపోవడం లేదా అతి ఎక్కువగా నిద్ర పోవడం చేస్తుంటారు. అతి తక్కువగా నిద్రపోతేనే సమస్యలు వస్తాయనుకుంటారు. నిజానికి అతినిద్ర వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. మన శరీరానికి 6 గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య నిద్ర సరిపోతుంది. కొంత మంది ఎనిమిది గంటలకు మించి నిద్రపోయేవారు ఉన్నారు. చిన్న పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం, కానీ పెద్దవారికి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర సరిపోతుంది. ఎవరైతే ఎనిమిది గంటలకు మించి తొమ్మిది, పది గంటలు నిద్రపోతారో వారిలో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


తలనొప్పి 
అతిగా నిద్ర పోవడం వల్ల తలనొప్పి వచ్చే ఛాన్సులు ఎక్కువ. సాధారణ సమయం కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల మెదడులోని కొన్ని న్యూరో ట్రాన్స్‌మీటర్ల పై ప్రభావం పడుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది. ఉదయం పూట నిద్రపోతే, రాత్రిపూట నిద్రకు భంగం కలుగుతుంది. దీనివల్ల కూడా తలనొప్పి వస్తుంది. 


ఊబకాయం 
అతినిద్ర ఊబకాయానికి కారణం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 8 గంటలకు మించి నిద్రపోకపోవడమే మంచిది. అంతకుమించి నిద్రపోయే వారిలో బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంది. అలాగే అవసరమైన దానికంటే తక్కువ గంటలు నిద్రపోయే వారిలో కూడా ఊబకాయం వచ్చే ఛాన్సులు ఎక్కువ. కాబట్టి 6 నుంచి 8 గంటల మధ్య నిద్రను ఎంచుకోవడం మంచిది.


డయాబెటిస్ 
నిద్రకూ, డయాబెటిస్‌కు పరోక్ష సంబంధం ఉంది. అతి తక్కువ గంటలు నిద్రపోతే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందనుకుంటారు, అలాగే అవసరమైన దాని కంటే ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో కూడా టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.  అతిగా నిద్రపోయే వారిలో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. 


గుండె వ్యాధులు
అతినిద్ర గుండె జబ్బులకు దారితీస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అతి నిద్రకు, గుండె జబ్బులకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ప్రతి రోజూ 11 గంటలు పాటూ నిద్రపోయే వారితో పోలిస్తే, రోజులో ఏడెనిమిది గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ అని ఆరోగ్య డేటా చెబుతోంది.


డిప్రెషన్ 
డిప్రెషన్‌తో బాధపడుతున్న చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అయితే అతినిద్ర కూడా డిప్రెషన్‌కు కారణం అవుతుంది. కాబట్టి మీకు నిత్యం నిద్ర వస్తూ ఉంటే వైద్యుల్ని సంప్రదించడం ముఖ్యం. 



Also read: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో







































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.