వాతావారణంలోని ఉష్ణోగ్రత కూడా మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. వారిలో కోపం, చికాకు, నిరాశ, డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి... ఇలాంటి మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఇది నమ్మడానికి కష్టంగానే ఉన్నా నిజం. వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటే మనుషుల్లో తీవ్ర మానసిక సమస్యలు కలిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింది. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వాతావరణంలో విపరీతంగా వేడి పెరిగినప్పుడు అత్యవసరంగా వైద్య సహాయం అవసరమయ్యేంత స్థాయిలో మానసిక సమస్యలు పెరుగుతాయని వారు తెలిపారు.
Also read: ఐస్‌క్రీముల్లో వాడే ఈ ద్రావకం ఎంత ప్రమాదకరమో తెలుసా?
మానసిక ఒత్తిడితో పాటూ
జామా సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తాలూకు వివరాల ప్రకారం అమెరికాలో వేసవికాలంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఆ రోజుల్లో మానసిక ఆరోగ్య సంబంధ రోగాలు అధికమవుతున్నాయి, వారు అత్యవసర విభాగంలో చికిత్స తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో కూడిన ఆరోగ్య సమస్యలు కలుగుతున్నట్టు గుర్తించారు అధ్యయనకర్తలు.
ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల వడదెబ్బ వంటి శారీరక రోగాలు కలుగుతాయని తెలుసు, కానీ మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని ఈ అధ్యయనం తేల్చింది.అమెరికాలోని అన్ని వయసుల వారి మానసిక ఆరోగ్యంపై ఉష్ణోగ్రత ఇదే రకమైన ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తించారు పరిశోధకులు. ముఖ్యంగా వాతావరణంలో వేడి పెరుగుతున్నప్పుడు అప్పటికే మానసిక సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు అధ్యయనకర్తలు.
Also read: గోధుమ నూడుల్స్‌కు బదులు వూడుల్స్, మధుమేహులు కూడా తినొచ్చు
కోవిడ్ 19 ప్రభావం...
ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. ఇప్పుడు వీటికి తోడు వేడి ఉష్ణోగ్రతలు కూడా మానసిక సమస్యలను పెంచుతాయని తేలడంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి.