ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్యల్ల మధుమేహం కూడా ఒకటి. ఏటా లక్షల మంది కొత్తగా మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అనేది శరీరంలోని ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించనప్పుడు సంభవించే ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి వచ్చాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. లేకుంటే అది నరాలతో సహా శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేయగలదు. నరాలపై ఇది ప్రభావం చూపి ‘డయాబెటిక్ న్యూరోపతి’ సమస్యకు కారణం అవుతుంది.
నరాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
మాయో క్లినిక్ ప్రకారం, రక్తంలో చక్కెర అధికమైతే సంభవించే కలిగే నరాల సమస్య ‘డయాబెటిక్ న్యూరోపతి’. ఈ పరిస్థితికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చిన్న రక్తనాళాల గోడలు బలహీనపడి, తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీనివల్ల నాడులకు ఆక్సిజన్, పోషకాలు, సంకేతాలు అంతే సామర్థ్యం తగ్గిపోతుంది.
లక్షణాలు...
డయాబెటిక్ న్యూరోపతి వచ్చిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవి శరీరం జలదరింపుగా అనిపించడం, తిమ్మిర్లు అధికంగా రావడం, శరీరంలో కారణం లేకుండా మంట, నొప్పి వంటివి వస్తాయి. ఇందులో నరాలకు నష్టం వాటిల్లుతుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే పరిస్థితి తీవ్రమవుతుంది. పాదాలు, కళ్లు, గుండె, రక్తనాళాదలు, పంటి చిగుళ్లు, మూత్రపిండాలపై చాలా ప్రభావం పడుతుంది. శరీరంలో గుండెకు, ఇతర భాగాలకు రక్తప్రసరణపై ప్రభావ చూపుతుంది. గుండెకు, మెదడుకు రక్తాన్ని మోసుకెళ్లు రక్తనాళాలకు హాని కలిగిస్తుంది.
మధుమేహం సంకేతాలు
మధుమేహం వచ్చిన వారిలో సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
1. ఎక్కువగా దాహం వేస్తుంది.
2. తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.
3. బరువు తగ్గిపోతారు
4. మూత్రంలో కీటోన్లు బయటికి పోతాయి.
5. తీవ్రంగా అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది.
6. చిరాకుగా అనిపిస్తుంది
7. మానసికంగా కోపం పెరిగిపోతుంది.
8. చూపు అస్పష్టంగా అనిపిస్తుంది.
9. పుండ్లు త్వరగా తగ్గవు
ఎవరికైనా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఇది వారసత్వంగా కూడా వస్తుంది. ఇది రాకుండా అడ్డుకోవాలంటే ఒకటే దారి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. పోషకాలు నిండుగా ఉండే ఆకుకూరలు అధికంగా తినాలి. తీపి పదార్థాలను పూర్తిగా మానేయాలి. దంపుడు బియ్యం, రాగి జావ, తాజా పండ్లు, పాలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మటన్ అధికంగా తినకూడదు. మితంగా తినవచ్చు. చేపలు, రొయ్యలు తింటే ఎంతో మంచిది. వారానికి రెండు మూడు సార్లు చికెన్ తినవచ్చు.
Also read: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.