Prostate Cancer Cases is Rising in India: భారతదేశంలో రోజురోజుకీ ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వయస్సు మళ్లిన వారిలో ఈ వ్యాధి కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతం 50 సంవత్సరాల లోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్‌ఓ సెప్టెంబర్ మాసాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అవగాహనా నెలగా పేర్కొని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది.
2022లో 40 వేల కేసులు
భారత్‌లో 50 సంవత్సరాల లోపు పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళనకర అంశమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి కూడా చాలా ప్రభావవంతంగా ఉందని అంటున్నారు. ప్రొస్టేట్ గ్రంథిలో ఈ క్యాన్సర్ ఏర్పడి చాలా స్లోగా విస్తరించే వ్యాధి. ముందుగానే గుర్తిస్తే సమర్థంగా క్యాన్సర్ బారి నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ నెలను ప్రొస్టేట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్‌గా గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు WHO ప్రతినిధులు చెప్పారు. ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా ఈ తరహా క్యాన్సర్ కనిపించేదని కానీ ప్రస్తుతం నిండా 50 ఏళ్లు నిండకుండానే ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. WHO 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం భారత్‌లో దాదాపు 37 వేల 948 వరకు ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదు కాగా మొత్తం క్యాన్సర్ కేసుల్లో అవి 3 శాతంగా ఉన్నాయి.
ఆ ఏడాది దేశవ్యాప్తంగా 14 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఆలస్యంగా క్యాన్సర్‌ను గుర్తిస్తుండడం వల్ల డయాగ్నసిస్ కష్టం అవుతోందని వైద్యులు తెలిపారు. అమెరికాలో అయితే ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ కేసుల్లో 80 శాతం వరకు ఇనీషియల్ స్టేజెస్‌లోనే గుర్తించి వైద్యం అందిస్తారని ఢిల్లీ క్యాన్సర్ స్పెషలిస్టు వైద్యుడు గుప్త తెలిపారు. భారత్‌లో మాత్రం 20 శాతం కేసులు మాత్రమే ఇనీషియల్‌గా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ PSA టెస్టులు, చెకప్స్ ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తించొచ్చని అన్నారు.
తొలి నాళ్లలో గుర్తింపు కష్టమే..
తొలి నాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలేవీ రోగుల్లో కనిపించవని గుప్త తెలిపారు. అందుకే మగవాళ్లు వార్నింగ్స్ సైన్స్ వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని అన్నారు. మూత్రానికి వెళ్లడంలో ఇబ్బందులు, యూరిన్‌లో బ్లడ్ లేదా సెమెన్ రావడం, హిప్స్‌లో పెయిన్స్ రావడం, పెల్విస్ లేదా బ్యాక్‌లో నొప్పి వస్తే ఇవి ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కావొచ్చని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అప్పుడు కూడా అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం అవుతుందని హెచ్చరిస్తున్నారు. యువతలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో 35 నుంచి 44 ఏళ్ల మధ్య వారిలో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ పేషెంట్ల కోసం ప్రస్తుతం అధునాతమైన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే మగవారిలో సహజంగా జబ్బులు గురించి ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండే లక్షణం కూడా ఈ వ్యాధి తీవ్రత పెరగడానికి కారణం అవుతోంది.
ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు
ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు గురుగ్రామ్‌లోని పరస్ హాస్పిటల్ ఆంకాలజీ స్పెషలిస్టు వైద్యులు డాక్టర్ తన్వి సూద్ తెలిపారు. ఈ క్యాన్సర్ నేచురల్‌గా చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని అయితే దీనికి అదే స్థాయిలో చికిత్స కూడా అందుబాటులో ఉందన్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీని ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. అంతే కాకుండా గతంలో కుటుంబంలో పెద్దవాళ్లు ఎవరైనా దీని బారిన పడి ఉంటే తర్వాతి తరం వాళ్లకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని సూద్ హెచ్చరించారు. అలాంటి వాళ్లు ఫ్రీక్వెంట్‌గా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రస్తుత జీవనశైలి కూడా ఓ కారణంగా పేర్కొన్న వైద్యులు, ప్రొస్టేట్ ముప్పు ఉన్న వాళ్లు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని మాంసాహారాలు తగ్గించాలని, స్మోకింగ్ అలవాట్లు ఉంటే మానుకోవాలని అన్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.