బెండకాయ ముక్కలు చేసుకుని వాటిని రాత్రంతా నానబెట్టి పొద్దున్నే ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు సైన్స్ కూడా ఇదే విషయాన్ని ఆధారాలతో నిరూపించింది. నిజానికి బెండకాయ ఒక పండు.. కానీ కూరగాయగా వినియోగించబడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మధుమేహులకు అనేక రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే కరగని డైటరీ ఫైబర్ ఇందులో ఉంటుంది. చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఆకలి బాధని పరిమితం చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇంకొక విధంగా కూడా మధుమేహులకి ఇది మేలు చేస్తుంది. పేగుల ద్వారా చక్కెర శోషణను నియంత్రిస్తుంది.
2011లో జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ బయో అలైడ్ సైన్సెస్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం డయాబెటిక్ ఎలుకలకు బెండకాయ గింజలు, తొక్కలు తినిపించారు. అవి తిన్న తర్వాత వాటి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు. వాటికి సుమారు పది రోజుల పాటు బెండకాయ రసం ఇచ్చారు. బెండకాయలో అధిక మొత్తంలో కరిగే, కరగని ఫైబర్ ఉన్నాయి. 100 గ్రాములకు నాలుగు గ్రాములు అందుతాయి. ఇవి విచ్ఛిన్నం కావడానికి, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల రక్తంలోకి నెమ్మదిగా చక్కెర విడుదల అవుతుంది. అందుకే వీటిని తీసుకుంటే బ్లడ్ షుగర్ ఎప్పుడూ పెరగదు. స్థిరంగా ఉంటుంది.
బెండకాయలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, లీనోలేయిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్, ఫోలేట్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కేవలం ఒక కప్పు వండిన బెండకాయలో దాదాపు 37 మైక్రోగ్రాముల ఫోలేట్ అందుతుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా ఉంచేందుకు సహాయపడతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇది వండటం కూడా చాలా సులభంగా ఉంటుంది.
బెండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
అధిక ఫైబర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో పెక్టిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని కలిగించకుండా నివారిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత నుంచి బయటపడేస్తుంది. కాలేయంలోకి వ్యర్థాలని చేర్చే పిత్త ఆమ్లాన్ని బయటకి పంపిస్తుంది. నిద్రకి అవసరమయ్యే సెరోటోనిన్, మెలటోనిన్ ని నియంత్రిస్తాయి.
ఎలా తినాలి?
బెండకాయ వేపుడు, కూర ఎలాగైనా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకుని చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. ఇందులోని విత్తనాలతో నూనె కూడా తీసుకోవచ్చు. ఈ నూనె ఆరోగ్యకరమైనది. రుచిగా, మంచి సువాసన కలిగి ఉంటుంది. బెండకాయ ఆకులని సలాడ్ లో కూడా వేసుకుని తినొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ ఔషదాన్ని అతిగా వాడుతున్నారా? జాగ్రత్త, చర్మ క్యాన్సర్ వస్తుంది - తాజా అధ్యయనం వెల్లడి