సింగర్ యశస్వి కొండెపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘జాను’ సినిమాలో ‘లైఫ్ ఆఫ్ రామ్’ అనే పాట ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఓ ఛానెల్ లో ప్రసారం అయ్యే పాటల షో ద్వారా మంచి పేరు సంపాదించాడు.  తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు.  


ఇంతకీ వివాదం ఏంటంటే?


యశస్వి ఇటీవల ఓ షోలో పాల్గొన్నాడు. తాను చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి అందులో వివరించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోపై కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు ఫరౌ కౌసర్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదంతా తప్పుడు ప్రచారమని వెల్లడించింది. నవసేన ఎన్జీవో ద్వారా చాలా మందిని చదివిస్తున్నట్లు చెప్పాడని, అదంతా అవాస్తవం అని ఆమె వెల్లడించింది. యశస్వి నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని వెల్లడించింది. తమ సంస్థ పేరు చెప్పుకుని లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాడని  కౌసర్‌ ఆరోపించింది.   






ఆరోపణలపై యశస్వి స్పందన ఏంటంటే?  


కౌసర్ ఆరోపణలపై యశస్వి స్పందించాడు. నవసేన ఎన్జీవోలోని పిల్లలకు సాయం చేస్తున్నట్లు, వారిని దత్తత తీసుకున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదని వెల్లడించాడు. తాను వాళ్ల దగ్గరికి కూడా వెళ్లలేదని చెప్పాడు. తనకు వారికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. సాధ్య ఫౌండేషన్‌కు తమ ఫ్యామిలీ సాయం చేస్తుందని, ఆ ఫౌండేషన్‌ తమకు నచ్చిన సంస్థలకు సాయం చేస్తుంటుందన్నాడు. అలా వాళ్లు కాకినాడలోని ఓ అనాథాశ్రమానికి సాయం చేశారని చెప్పాడు. ఆ ఫౌండేషన్ వాళ్లు నవసేన ట్రస్టుకి మూడు, నాలుగుసార్లు సాయం చేసినట్లు వెల్లడించారు. కాబట్టి వాళ్లతో ఆల్‌ ది బెస్ట్‌ చెప్పించుకున్నట్లు తెలిపాడు.


ఈ ప్రోమోలో నవసేన అనే బోర్డు కనిపించడంపై  కౌసర్‌ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మా బోర్డు వాడుకున్నారు కానీ, పిల్లలను చూపించలేదు అని ఆమె ఫోన్‌ చేసి అడిగిందని చెప్పాడు. ఇది జస్ట్ ప్రోమో, ఎపిసోడ్‌లో అంతా వస్తుందని చెప్పినట్లు వివరించాడు. అయినా, మా సంస్థ బోర్డు చూపించారు  కాబట్టి 9 నెలల దాకా అనాథాశ్రమాన్ని దత్తత తీసుకోవాలని బెదిరించిందని చెప్పాడు. నాకు ఉన్నంతలో సాయం చేస్తాను, కానీ దత్తత ఎలా తీసుకుంటాను? అని చెప్పినట్లు వివరించాడు. దీంతో ఆమె లీగల్‌గా వెళ్తానని చెప్పడంతో వెళ్లమని చెప్పానన్నాడు. ఆమె లేనిపోని ఆరోపణలు చేయడంతో షోకు సంబంధించిన ప్రోమో డిలీట్‌ చేయించినట్లు వెల్లడించాడు. తన జీవితంలో ఇప్పటి వరకు ఎక్కడా నెగెటివ్‌ మార్క్‌ లేదని చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్న వివాదం చూస్తుంటే బాధగా ఉందన్నాడు. పిల్లలను అడ్డు పెట్టుకుని పేరు సంపాదించుకోవాలనుకునే దురుద్దేశం తనకు లేదన్నాడు.  


Read Also: అస్సలు ఊహించలేదు - ‘ఆదిపురుష్’ టీజర్‌పై ఎట్టకేలకు స్పందించిన కృతి సనన్